
బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాజకీయ సన్యాసం తీసుకునే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి గేట్లు తెరిచారని ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు కెసిఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో, ఇతర ముఖ్య నేతలతో సమావేశమై తోలు తీస్తానంటూ బీరాలు తీశారని ఆయన తెలిపారు. “కెసిఆర్ సార్ లేసిండు…ఇక తడాఖా చూపిస్తడు..” అని బిఆర్‌ఎస్ నేతలు గొప్పగా చెప్పారని, చివరకు కెసిఆర్ అసెంబ్లీలో మూడు నిమిషాలు గడిపి ఫాం హౌస్‌కు వెళ్ళారని అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే టి. హరీష్ రావు సిక్స్ కొట్టబోయి చతికిలపడ్డారని ఆయన విమర్శించారు. కృష్ణా జలాల అంశంపై అసెంబ్లీలో చర్చించకుండా వాకౌట్ చేసి వెళ్ళిపోయారని ఆయన తెలిపారు. అసెంబ్లీలో చర్చించి, లోపాలు ఏవైనా ఉంటే ఎత్తి చూపించి, ప్రభుత్వానికి సరైన సలహాలు, సూచనలు చేసి ఉంటే బాగుండేదని ఎమ్మెల్యే యెన్నం అన్నారు.