
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం బడ్జెట్ సమావేశాల ముఖ్య తేదీలకు ఆమోదం తెలిపింది. పార్లమెంట్ క్యాలెండర్ ప్రకారం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 (ఆదివారం) కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టనున్నారు. ఇటీవల కాలంలో ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. బడ్జెట్ సమావేశాలను ప్రారంభించేందుకు జనవరి 28న పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. ఆర్థిక సర్వేను జనవరి 29న పార్లమెంటులో ప్రవేశపెడతారు. బడ్జెట్ సమావేశాల మొదటి భాగం జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగుతుంది. రెండో భాగం మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహిస్తారు. బడ్జెట్ తయారీ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని అధికార వర్గాలు తెలిపాయి. మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది స్వాతంత్య్రం తర్వాత 88వ బడ్జెట్. 2017 నుంచి ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టడం కొనసాగిస్తూ వస్తున్నారు.