Reading Time: < 1 minute

ఇస్లామాబాద్ :ఉగ్రవాద మద్దతు సంస్థలకు ఆశ్రయం కల్పించడంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన పాకిస్థాన్ తాజాగా ఉగ్రముఠా లష్కరే తయ్యిబా (ఎల్‌ఇటి) … హమాస్ నేతల సమావేశానికి వేదికగా మారింది. ఇటీవల పాకిస్థాన్ లోని గుజ్రాన్‌వాలాలో పాకిస్థాన్ మర్కజే ముస్లిం లీగ్ నిర్వహించిన కార్యక్రమంలో హమాస్ సీనియర్ కమాండర్ నాజీ జహీర్ పాల్గొన్నట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. అతడు లష్కరే తయ్యిబా కమాండర్ రషీద్ అలీ సంధుతో భేటీ అయినట్టు తెలుస్తోంది. ఈ రెండు ఉగ్రవాద గ్రూపుల మధ్య సంబంధాన్ని మరింత పెంచుకోవడానికి ఈ సమావేశంలో చర్చలు జరిపినట్టు సమాచారం. వీరి సమావేశానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌లో హమాస్ జరిపిన ఉగ్రదాడికి ముందు కూడా హమాస్ సీనియర్ కమాండర్ నాజీ జహీర్ పాకిస్థాన్‌కు వెళ్లాడు. అక్కడ జమియత్ ఉలేమా ఇ ఇస్లాం అధిపతి మౌలానా ఫజల్ ఉర్ రెహ్మాన్‌ను కలిశారు. పహల్గాంలో ఉగ్రదాడికి కొన్ని వారాల ముందు కూడా జహీర్ పీవోకే ను సందర్శించాడు. ఆ సమయంలో పీవోకేలో లష్కరే తయ్యిబా నిర్వహించిన భారత వ్యతిరేక ర్యాలీలోనూ పాల్గొన్నాడు. తాజాగా అతడు మరోసారి పాక్ ఉగ్రసంస్థలతో సమావేశం కావడంతో వారు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడతారోనని అంతర్జాతీయ మీడియా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాక్ ఆర్మీ అధికారులు కూడా పాల్గొనడం గమనార్హం.