
న్యూఢిల్లీ: విద్యాసంస్థలు, ఆస్పత్రులు, రైల్వేస్టేషన్లు తదితర ప్రదేశాల్లో కుక్కలు కరుస్తోన్న సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయాలని సుప్రీం కోర్టు బుధవారం అధికారులను ఆదేశించింది. వీధి కుక్కల వివాదంపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు వీధి కుక్కల రక్షణపై పెద్ద మొత్తంలో పిటిషన్లు దాఖలు అవుతుండడంపై అసహనం వ్యక్తం చేసింది. “ అందరూ కుక్కల గురించే ఆలోచిస్తుంటే , ఇతర జంతువుల జీవితాల సంగతేమిటి ? కోళ్లు, మేకల గురించి ఎందుకు మాట్లాడరు ? వాటివి ప్రాణాలు కావా ” అని ఈ కేసులో కుక్కల రక్షణపై వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌ను ప్రశ్నించింది.
కుక్కలు కరవబోతున్నాయా లేదా అనే విషయాన్ని అవి దగ్గరకు వచ్చేంతవరకు తెలుసుకోలేమని వ్యాఖ్యానించింది. ఈ సమస్యకు చికిత్సకంటే నివారణే ముఖ్యమన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. న్యాయవాది కపిల్‌సిబల్ స్పందిస్తూ , ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల్లో కుక్కలకు టీకాలు వేయడం ,స్టెరిలైజ్ చేయడం, షెల్టర్లు నిర్మించడం వంటి పద్ధతులతో వీధి కుక్కల సమస్య తగ్గుతోందని తెలిపారు. అయితే భారత్‌లో ఈ పద్ధతులను సరైనవిధంగా పాటించకపోవడం, వీధుల్లో చెత్త విపరీతంగా పేరుకుపోవడంతో వీటి బెడద తీవ్రమవుతోందన్నారు. జంతు సంక్షేమ ఎన్‌జీవో ల తరఫున హాజరైన న్యాయవాదికాలిన్ గోన్సాల్వ్ వాదిస్తూ దేశంలో కుక్కకాట్ల సంఖ్యను ఉన్నదానికంటే ఐదు రెట్లు ఎక్కువగా ప్రభుత్వ నివేదికలు చూపుతున్నాయని ఆరోపించారు. కుక్కకాటు ఇంజెక్షన్ల సంఖ్యను కూడా సరైన విధంగా లెక్కించట్లేదన్నారు. 2021 నుంచి 19 రాష్ట్రాల్లో రేబిస్ కేసులు లేవన్నారు.