Reading Time: < 1 minute

 ఇండియా అండర్19 క్రికెట్ టీమ్ మరోసారి అదరగొట్టింది. సౌతాఫ్రికా యూత్ టీమ్‌తో జరిగిన మూడో, చివరి వన్డేలో భారత యువ జట్టు 233 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ 30తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూత్ ఇండియా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 393 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన సౌతాఫ్రికా 35 ఓవర్లలో కేవలం 160 పరుగులకే కుప్పకూలి హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. కిషన్ కుమార్ సింగ్ అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థి టీమ్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఓపెనర్లు జోరిచ్ (1), అద్నాన్ (9)లను కుమార్ ఔట్ చేశాడు. అంతేగాక వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ లెతాబోను కూడా వెనక్కి పంపాడు. లెతాబో ఖాతా కూడా తెరవలేక పోయాడు. కెప్టెన్ మహ్మద్ (4), జాసన్ (19) కూడా నిరాశ పరిచారు. డానిల్ బొస్మాన్ (40), పాల్ జేమ్స్ (41), కొమ్ బోథా 36 (నాటౌట్)లు కొద్ది సేపు పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇండియా బౌలర్లలో కిషన్ మూడు ఎనాన్ రెండు వికెట్లు పడగొట్టారు.

కదంతొక్కిన సూర్య, జార్జ్

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత్‌కు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అరోన్ జార్జ్ కళ్లు చెదిరే ఆరంభాన్ని అందించారు. కెప్టెన్ వైభవ్ ఆరంభం నుంచే తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు.ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తూ స్కోరును పరిగెత్తించాడు. అతనికి అరోన్ తనవంతు సహకారం అందించాడు. ఈ జోడీని కట్టడి చేసేందుకు సౌతాఫ్రికా బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన సూర్యవంశీ 74 బంతుల్లోనే 10 భారీ సిక్సర్లు, 9 ఫోర్లతో 127 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అండర్19 క్రికెట్‌లో అత్యంత చిన్న వయసులో సెంచరీ సాధించిన కెప్టెన్‌గా కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన జార్జ్ 106 బంతుల్లోనే 16 ఫోర్లతో 118 పరుగులు చేశాడు. వేదాంత్ (34), అభిజ్ఞాన్ కుందు (21), మహ్మద్ ఎనాన్ (28) నాటౌట్, హెనిల్ పటేల్ 19 (నాటౌట్) తమవంతు సహకారం అందించారు. దీంతో భారత్ భారీ స్కోరును నమోదు చేసింది.