
రంగారెడ్డి జిల్లా: అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) వలలో ఒకేసారి మూడు అవినీతి చేపలు చిక్కాయి. లంచాలు వసూల్ చేస్తూ ప్రజలను పీడిస్తున్న ముగ్గురు అవినీతి అధికారులు బుధవారం ఎసిబి అధికారులు పట్టుబడ్డారు. నందిగామ మండల ఎంపిడిఓ సుమతి, ఎంపిఓ తేజ్ సింగ్, ఈదులపల్లి గ్రామ కార్యదర్శి చెన్నయ్య.. భవన నిర్మాణానికి సంబంధించిన అనుమతి కోసం ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. అనంతరం పక్కా ప్లాన్ ప్రకారం రూ.1 లక్ష లంచం తీసుకుంటుండగా నందిగామ ఎంపిడిఓ, ఎంపిఓ, ఈదులపల్లి కార్యదర్శిలను ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ముగ్గురు అధికారులను అదుపులోకి తీసుకున్న ఎసిబి అధికారులు.. వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.