Reading Time: 2 minutes

“రాష్ట్రంలో రాజకీయ శూన్యత లేదు, కాబట్టి కొత్త పార్టీలకు మనుగడ కష్టమే..” అని రాష్ట్ర శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత స్వయంగా వచ్చి తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరడంతో ఆమోదించానని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. అంతకు ముందు ఆమె స్వయంగా రాజీనామా లేఖ అందించకుండా వ్యక్తిగత కార్యదర్శి (పిఏ) ద్వారా పంపించినందున ఆమోదించలేదని ఆయన చెప్పారు. భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం అని భావించి కొంత సమయం ఇవ్వడం సర్వసాధారణంగా చేస్తుంటామని ఆయన తెలిపారు. చట్ట సభల్లో ఎక్కడైనా సభ్యుడు రాజీనామా చేసినప్పుడు ప్రసంగించేందుకు అనుమతించాలని కోరితే ఇవ్వడం సంప్రదాయంగా ఉందన్నారు.

కవిత కోరిక మేరకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చానని ఆయన తెలిపారు. కవిత పార్టీ పెట్టబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం గురించి ప్రశ్నించగా, రాష్ట్రంలో రాజకీయ శూన్యత లేదు కాబట్టి కొత్త పార్టీలకు మనుగడ కష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నో పార్టీలు వచ్చాయి, ఆ వెంటనే కొంత కాలానికి అవి కనుమరుగయ్యాయని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల గురించి ప్రశ్నించగా, సాధారణంగా అధికార పార్టీకే ఎక్కువగా గెలుపొందే అవకాశాలు ఉంటాయని ఆయన తెలిపారు. కౌన్సిల్‌లో కవిత కుటుంబ సభ్యుల గురించి చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా, తాను స్పందించడం బాగుండదని, అవి ఆమె వ్యక్తిగతమైన వ్యాఖ్యలని అన్నారు.

వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయని ఆయన తెలిపారు. నియోజకవర్గాల పునర్-విభజన ఏ ప్రాతిపదికన చేస్తారో అనే అంశంపై స్పష్టత లేదన్నారు. జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘హిల్ట్’ ద్వారా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేదన్నారు. మూసీ కాలుష్యం నల్లగొండ వరకూ వస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కాలుష్య కట్టడికి, పారిశ్రామిక భూముల క్రమబద్దీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడం భావ్యం కాదన్నారు. పైగా రాష్ట్రాలపై నలభై శాతం భారం వేయడం వల్ల కూడా ఆర్థిక భారం పడుతుందన్నారు.

కొత్త భవనంలో కౌన్సిల్

ఇప్పుడు రూపుదిద్దుకుంటున్న పాత అసెంబ్లీ భవనంలోనే వచ్చే శాసనమండలి సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు మరమ్మత్తు పనులు వేగవంతం చేయించామని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు.