Reading Time: < 1 minute

హైదరాబాద్: మరికొన్ని రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తోంది. తెలంగాణలో కంటే ఆంధ్రలో ఈ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు. దీంతో ఉద్యోగాల కోసం, ఇతర అవసరాల కోసం తెలంగాణకి వచ్చి సెటిలైన చాలా మంది ఈ పండగకి సొంతూరుకు వెళ్తారు. సొంత వాహనాలు ఉన్నవాళ్లు అందులో వెళ్లిపోతే.. మిగితా వాళ్లు పబ్లిక్, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టుపై ఆధారపడాల్సిందే. ఇప్పటికే సంక్రాంతి ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తాజాగా తెలంగాణ ఆర్టిసి కూడా ప్రత్యేక బస్సులను ప్రకటించింది.

పండగ సందర్భంగా 6,431 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు పేర్కొంది. ఈ నెల 9, 10, 12, 13, 18, 19 తేదీల్లో ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయి. అయితే ఇందులో ప్రయాణించే వాళ్లపై అదనపు ఛార్జీల భారం తప్పదు. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఆర్టిసి అధికారులు తెలిపారు. ఎంజిబిఎస్, జెబిఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఆరాంఘర్, ఎల్బినగర్, కెపిహెచ్‌బి, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయని చెప్పారు.