Reading Time: < 1 minute

మూగజీవాల రక్తాన్ని సేకరిస్తున్న బ్లడ్ మాఫియా వ్యవహారాన్ని కేంద్రం సీరియస్‌గా పరిగణించింది. కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. బతికి ఉండగానే గొర్రెలు,మేకల రక్తం సేకరణ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం కేంద్ర డ్రగ్స్ కంట్రోల్ యంత్రాంగంతో నగరంలో సోదాలను నిర్వహిస్తోంది. కాచిగూడలోని సిఎన్‌కె ఇంపోర్టు అండ్ ఎక్స్‌పోర్టు కంపెనీలో నగర పోలీసులతో కలిసి తనిఖీలను నిర్వహించింది. సుమారు వెయ్యి లీటర్ల మూగజీవాల రక్తానికి సంబంధించి నిల్వఉంచిన ప్యాకెట్లను సీజ్ చేశారు. రక్తం ప్యాకెట్లను హరియానాలోని పాలీ మెడిక్యూర్ కంపెనీకి పంపిస్తున్నట్లుగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే, ఈ మూగ జీవాల రక్తంతో ఏం చేస్తున్నారన్న దానిపై అధికారులు వివరాలను సేకరిస్తున్నారు.

ఈ రక్తంతో క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారా…? లేక మరేమైన వాటికి వినియోగిస్తున్నారా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. కాగా, ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న సిఎన్‌కె కంపెనీ యజమాని నికేష్ పట్టుబడితే అన్ని వివరాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నికేష్ కోసం గత మూడురోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఈ బ్లడ్ మాఫియా భాగోతం ఇటీవల కీసరలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో గుట్టు రట్టు కావడంతో యజమాని నికేష్ పరారయ్యారు. నికేష్ దొరికితే రక్త సేకరణపై పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదిలావుండగా, మూగజీవాల రక్తసేకరణ నగరంలో తీవ్ర కలకలం రేపిన విషయం విధితమే.