Reading Time: < 1 minute

బెంగళూరు: కర్ణాటక బెలగావి జిల్లాలోని ఓ చక్కెర కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. బుధవారం కర్మాగారంలో బాయిలర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారని పోలీసు తెలిపారు. బైల్‌హోంగల్ తాలూకాలోని మరకుంబి గ్రామంలో ఉన్న ఇనామ్‌దార్ చక్కెర కర్మాగారంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనతో కార్మికులు, సమీప నివాసితులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పేలుడు కారణంగా బాయిలర్ నుండి కరిగిన వేడి పదార్థం.. కార్మికులపై చిమ్మింది. దీంతో పలవురు కార్మికులు తీవ్రంగా కాలిపోయారు. ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో నలుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని మెరుగైన చికిత్స కోసం బెలగావిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా సాంకేతిక లోపం లేదా నిర్లక్ష్యంగా జరిగిందా అనే కోణంలో పరిశీలిస్తున్నామని… దర్యాప్తు ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.