Reading Time: 2 minutes

ముంబై : మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానం కోసం బద్ధ శత్రువులైన కాంగ్రెస్‌బీజేపీ పార్టీలు జతకట్టాయి. ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అయితే తాజాగా ఆ పొత్తుపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి పొత్తులను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని హెచ్చరించారు. మహారాష్ట్ర లోని కళ్యాణ్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్‌కు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 31 స్థానాలు. దీనిలో షిండే నేతృత్వం లోని శివసేనకు 27 స్థానాలు రాగా, బీజేపీకి 16, కాంగ్రెస్‌కు 12, ఎన్‌సిపికి 4 స్థానాలు వచ్చాయి. దీంతో మున్సిపల పీఠం కోసం బీజేపీ , కాంగ్రెస్, ఎన్సీపీలు జతకట్టాయి.

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వం లోని శివసేనకు అధికారం దక్కకుండా ఉండేందుకు ఈ అరుదైన కూటమి ఏర్పాటైంది. కూటమి లోని 32 మంది కౌన్సిలర్ల మద్దతుతో బీజేపీకి చెందిన తేజశ్రీ కరంజులై ఇక్కడ మేయర్ పదవిని చేజిక్కించుకున్నారు. మేయర్ పదవి కోసం కాంగ్రెస్‌తో బీజేపీ చేతులు కలపడంపై శివసేనకు చెందిన శివసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎప్పుడూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడే ఆ పార్టీ ఇప్పుడు పొత్తు పెట్టుకోవడాన్ని శివసేన ఎమ్‌ఎల్‌ఏ బాలాజీ కినికార్ ప్రశ్నించారు. ఇది తమకు వెన్నుపోటు పొడవడమేనని ఆరోపించారు. అయితే ఈ విమర్శలను బీజేపీ ఉపాధ్యక్షుడు గులాబ్రావ్ కరంజుల్ పాటిల్ కొట్టి పారేశారు. అంబర్‌నాథ్‌లో శివసేనతో పొత్తుకు తమ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసిందని , కానీ దానినుంచి సానుకూలమైన స్పందన రాలేదన్నారు.

ఈ సందర్భంగా షిండే పార్టీపై అవినీతి ఆరోపణలు చేశారు. అంతేకాకుండా అకోలా జిల్లా లోని అకోట్ మున్సిపల్ స్థానం కోసం బీజేపీ తన బద్ధశత్రువైన ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెష్, ఎంఐఎం పార్టీలతో పొత్తును ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. ఎవరైనా గ్రామస్థాయి నాయకులు ఇలా పొత్తు పెట్టుకుంటే వారిపై చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. పొత్తుల వ్యవహారంపై ఇదివరకే నాయకులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు సచిన్‌సావంత్ ఇది బీజేపీ, కాంగ్రెస్ పొత్తు కాదని, శివసేన (షిండే ) అవినీతిని పారద్రోలడానికి అన్ని పార్టీలు ఏకమయ్యాయన్నారు. దీనిని బీజేపీ, కాంగ్రెస్ పొత్తుగా పోల్చడం సరికాదన్నారు.