
న్యూఢిల్లీ : పాకిస్థాన్‌కు చెందిన నిఘా సంస్థ ఐఎస్‌ఐ కోసం గూఢచర్యం చేస్తున్న 15 ఏళ్ల బాలుడిని పఠాన్‌కోట్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు. భారత్‌కు చెందిన మైనర్లతో గూఢచర్యం నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి ఐఎస్‌ఐ ఏజెంట్లు కుట్ర పన్నినట్టు గుర్తించామన్నారు. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్, పంజాబ్, హర్యానాకు చెందిన పలువురు మైనర్లను ట్రాప్ చేసి, ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా వారు ప్రేరేపిస్తున్నారని తెలిపారు.
ఇప్పటివరకు హర్యానా, పంజాబ్‌కు చెందిన 12 మంది, జమ్ముకశ్మీర్‌కు చెందిన 25 మంది మైనర్లను ఐఎస్‌ఐ ఏజెంట్లు ట్రాప్ చేసినట్టు గుర్తించామన్నారు. వారి కదలికలపై దర్యాప్తు బృందాలు నిఘా పెట్టినట్టు తెలిపారు. వీరంతా 14 నుంచి 17 ఏళ్ల లోపు వారేనన్నారు. మొదట పాక్ హ్యాండర్లు మైనర్ల ఫోన్‌లకు లింక్‌లు పంపిస్తున్నారని , వాటిని క్లిక్ చేయగానే వారి ఫోన్‌లను క్లోన్ చేస్తున్నారని పేర్కొన్నారు. ముందుగానే వారి ఫోన్లు క్లోన్ చేసి ఉండడంతో బాలురు తమ ఫోన్‌లలో సేవ్ చేసిన కంటెంట్‌ను హ్యాండర్లు సేకరిస్తున్నారన్నారు.
ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న బాలుడి ఫోన్‌ను స్కాన్ చేయగా, అతడు పాక్‌కు చెందిన ఐఎస్‌ఐ ఆధారిత ఏజెన్సీలు, ఉగ్రవాద గ్రూపుల నిర్వాహకులతో పలుమార్లు సంప్రదింపులు జరిపినట్టు తేలిందన్నారు. వారి సూచనల ఆధారంగా అతడు సైనిక స్థావరాల వీడియోలను చిత్రీకరిస్తున్నట్టు భద్రతా కాన్వాయ్‌ల కదలికలను లీక్ చేస్తున్నట్టు గుర్తించామన్నారు. ఐఎస్‌ఐ ఏజెంట్లతో సంప్రదింపులు కోసం అతడు ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను కూడా వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఇటువంటి ప్రమాదకర ముఠాల చేతిలో పడకుండా పిల్లలను రక్షించాలంటే , తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.