
న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేశారు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని మోడీ ఎక్స్‌లో వెల్లడించారు. “ స్నేహితుడు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడాను. ఆయనకు, ఇజ్రాయెల్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాను. ఇరు దేశాల సంబంధాలను ఈ ఏడాది మరింత బలోపేతం చేయడంపైన ప్రాంతీయ పరిస్థితుల పైన చర్చించాం. తీవ్ర వాదంపై ఉక్కుపాదం మోపాలని కచ్చితమైన నిర్ణయంతో ఉన్నాం. ” అని మోడీ తన ఎక్స్‌ఖాతాలో పేర్కొన్నారు.
ఇప్పటికే ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ అంశాల్లో సహకారం, ప్రగతిపై ఇరు దేశాల ప్రధానులు హర్షం వ్యక్తం చేశారు. రక్షణ, భద్రతా సంబంధాలను మరింత బలోపేతం చేయడం, తీవ్రవాదాన్ని అణచివేయడం వంటి అంశాలపై మాట్లాడారు. అలాగే మిడిల్‌ఈస్ట్ ప్రాంతం లోని తాజా పరిస్థితులపై చర్చించారు. శాంతి, స్థిరత్వం కోసం పాటుపడాలని నిర్ణయించారు. గత నెలలోనే నెతన్యాహు , మోడీకి ఫోన్ చేశారు. గాజాతో కాల్పుల విరమణ అంశంపై చర్చించారు. నెతన్యాహు గత నెలలోనే ఇండియాలో పర్యటించాల్సి ఉంది. అయితే వివిధ కారణాల్లో వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ప్రధానులు పలు అంశాలపై చర్చించడం ఆసక్తికరంగా మారింది.