
వాషింగ్టన్: గ్రీన్‌లాండ్ అమెరికాలో భాగంగా మారాల్సిందేనని, అది తమ జాతీయ భద్రతకు అవసరమని అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం పునరుద్ఘాటించింది. దానిపై నియంత్రణ సాధించేందుకు తమ వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయని, వాటిలో సైన్యాన్ని వాడే అంశం కూడా పరిశీలనలో ఉందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. గ్రీన్‌ల్యాండ్ వ్యూహాత్మకంగా కీలకమైందని, ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి దానిపై నియంత్రణ అవసరమని అధ్యక్షుడు భావిస్తున్నారన్నారు. ఆ లక్షం దిశగా ముందుకు వెళ్లడానికి అందుబాటులో ఉన్న అన్నిమార్గాలను పరిశీలించాలని తన బృందానికి సూచించారని చెప్పారు.
వెనెజువెలా నేత నికోలస్ మదురోను సైనిక ఆపరేషన్ ద్వారా అమెరికా కస్టడీ లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి గ్రీన్‌లాండ్ పేరు వార్తల్లో వినిపిస్తోంది. ఇంకో 20 రోజుల్లో మాట్లాడదామంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేయడం, గతంలో ఆయన ప్రభుత్వంలో పనిచేసిన కేటీ మిల్లర్ “త్వరలో (సూన్)” అనే పోస్టు పెట్టడం కలకలం రేపుతున్నాయి. దీంతో ఈ ద్వీపాన్ని అమెరికా తన నియంత్రణలోకి తీసుకుంటుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ట్రంప్ వ్యాఖ్యలను ఐరోపా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. వ్యూహాత్మక, ఖనిజాలతో నిండి ఉన్న ఈ ఆర్కిటెక్ ద్వీపంపై హక్కు అక్కడి ప్రజలకే ఉంటుందని మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.