Reading Time: < 1 minute

తెలంగాణలో విద్యా వ్యవస్థను, విశ్వవిద్యాలయాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. చదువులకు నిలయమైన యూనివర్సిటీల్లో రియల్ దందా చేస్తూ, భావితరాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీల భూములను టార్గెట్ చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు బుధవారం ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే భవనాలు కట్టడం కాదు, భావితరాలకు జ్ఞానాన్ని అందించే పరిశోధనా కేంద్రాలను కాపాడుకోవడం అని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మొన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి బలవంతంగా 100 ఎకరాలకు పైగా భూములను లాక్కున్నారని విమర్శించారు. 60 ఏళ్లుగా ఎంతో కష్టపడి కాపాడుకుంటూ వస్తున్న ఔషధ, సుగంధ మొక్కల పరిశోధనా కేంద్రం లోని 60 ఎకరాలను పూర్తిగా ధ్వంసం చేశారని, ఎంతో విలువైన పరిశోధనా సంపద నేలమట్టమైందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలకు పైగా అటవీ భూమిని తాకట్టుపెట్టి విధ్వంసం చేశారని ఆరోపించారు.

దీనివల్ల అక్కడి పర్యావరణ వ్యవస్థ చిన్నాభిన్నం కావడమే కాకుండా, మూగ జీవాల మనుగడకే ముప్పు వాటిల్లిందని, ఇప్పుడు తాజాగా మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయానికి చెందిన 50 ఎకరాలపై ప్రభుత్వం కన్ను పడిందని, అదే పద్ధతిలో ఇక్కడి భూములను కూడా లాక్కోవాలని చూస్తోందని విమర్శించారు. ఇవి ఏవో యాధృచ్చికంగా జరిగిన సంఘటనలు కావని, విద్యా వ్యవస్థపై, యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిపై జరుగుతున్న ఉద్దేశపూర్వక దాడి అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విద్యార్థులన్నా, పరిశోధనలన్నా, పర్యావరణమన్నా ఎందుకింత చిన్నచూపు అని నిలదీశారు. భవిష్యత్ తరాలకు జ్ఞానాన్ని అందించాల్సిన చోట, ఆవిష్కరణలకు ఊపిరి పోయాల్సిన చోట ఇలా భూములను లాక్కోవడం దేనికి సంకేతం? విద్యా సంస్థల భూములను కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లలా చూస్తారా రేవంత్ రెడ్డి గారు? అని ప్రశ్నించారు. తెలంగాణ భవిష్యత్తును నిర్మించాల్సింది పోయి ఉన్న విజ్ఞాన కేంద్రాలను బుల్డోజర్లతో కూల్చడం సిగ్గుచేటు అని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఈ చర్యలను ఆపాలని, యూనివర్సిటీల భూములను వాటికే వదిలేయాలని, లేదంటే విద్యార్థి లోకం, తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హరీష్‌రావు హెచ్చరించారు.