Reading Time: < 1 minute

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 9న విడుదలకు సిద్ధమైంది. అయితే అనుకోని విధంగా ఈ సినిమాకు సెన్సార్ కష్టాలు వచ్చాయి. జన నాయగన్ నిర్మాతలు తమ చిత్రం షెడ్యూల్ ప్రకారం జనవరి 9న విడుదల కావడానికి చాలా ముందుగానే, డిసెంబర్ 18న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌కు సమర్పించారు. బోర్డు చెప్పిన సవరణలు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. అయినప్పటికీ.. సర్టిఫికేట్ రావడం ఆలస్యం అయింది. దీంతో నిర్మాతలు మద్రాస్ హై కోర్టును ఆశ్రయించారు. తాజాగా మద్రాస్ హై కోర్టులో దీనిపై విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. జనవరి 9వ తేదీ ఉదయం తీర్పు వెలువరిస్తామని తెలిపింది.

ఇక సినిమా విషయానికొస్తే.. తెలుగులో సూపర్ హిట్ సాధించి.. జాతీయ అవార్డు కూడా గెలిచిన ‘భగవంత్ కేసరి’ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాలో పూజాహెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు హెచ్.వినోద్ దర్శకత్వం వహించగా.. అనిరుధ్ సంగీతం అందించాడు.