
ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపిఎల్‌లో బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తఫిజుర్ రెహమన్‌ని తీసుకోవడంపై ఇక్కడ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో అతన్ని రిలీజ్ చేయాలని రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసి కెకెఆర్ ఫ్రాంచైజీని బిసిసిఐ ఆదేశించింది. ఆ మేరకు కెకెఆర్ అతడిని రిలీజ్ చేసింది. దీంతో బంగ్లాదేశ్‌లో ఐపిఎల్ ప్రసారాన్ని నిషేధిస్తూ.. ఆ దేశం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాక.. టి-20 ప్రపంచకప్‌లో తమ జట్టు భారత్‌లో పర్యటించదంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసిసికి లేఖ రాసింది.
ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ హోస్టింగ్ ప్యానెల్ నుంచి ప్రముఖ టివి హోస్ట్ రిధిమ పాఠక్‌ని తొలగించారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలను రిధిమ ఖండించారు. తనని ఎవరూ తొలగించలేదని.. తానే స్వయంగా హోస్టింగ్ నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. ‘‘బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ నుంచి నన్ను తొలగించారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. వాటిలో నిజం లేదు. బిపిఎల్ నుంచి వైదొలగాలని నేను వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నా. నాకు దేశమే ముఖ్యం. తర్వాతే ఏదైనా. నిజాయతీ, గౌరవం, అభిరుచితో కొన్ని సంవత్సరాలు క్రికెట్‌కు సేవ చేసే అవకాశం నాకు లభించింది. దాన్ని మాత్రం కొనసాగిస్తాను. నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’’ అంటూ రిధిమ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.