Reading Time: < 1 minute

నాగచైతన్యతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ సమంత పెద్దగా సినిమాలు చేయలేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండే ఈ బ్యూటీ వెండితెరకు కాస్త గ్యాప్ ఇచ్చింది. చివరిగా 2023లో వచ్చి ‘ఖుషి’ సినిమాలో కనిపించింది సామ్. అయితే ఇటీవలే దర్శకుడు రాజ్ నిడిమోరుని.. సమంత పెళ్లాడిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా సమంత ఫ్యాన్స్‌కి ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. మళ్లీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది సమంత. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ‘ఓ బేబీ’ సినిమా తర్వాత నందిని రెడ్డి, సమంత కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది.

అయితే అప్పటి నుంచి సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్స్‌ బయటకు రాలేదు. తాజాగా ఈ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా టీజర్‌ని సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘టీజరే కానీ ట్రైలర్‌లా ఉంటుంది’ అంటూ పేర్కొంది. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేసింది. ‘మా ఇంటి బంగారం.. మీ అందరీతో కలిసిపోతుంది’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ పోస్టర్‌లో సమంత ఓ బస్సులో చీర కట్టుకొని సీరియస్ లుక్‌లో కనిపిస్తోంది. ఇక ఈ సినిమాని సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.