Reading Time: < 1 minute

అమరావతి: ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి గురు శిష్యులు కావడంతో ఎపిలో వైసిపి గెలవాలని బిఆర్‌ఎస్ కార్యకర్తలు, తెలంగాణలో బిఆర్‌ఎస్ విజయం సాధించాలని వైసిపి కార్యకర్తలు కోరుకుంటున్నారని వైసిపి మాజీ ఎంఎల్‌ఎ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం కేతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 90 శాతం మంది వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారని, అలాగే ఎపిలో జగన్ ప్రభుత్వం ఉండాలని బిఆర్‌ఎస్ కార్యకర్తలు కోరుకుంటున్నారన్నారు. ముందు నుంచి మాజీ సిఎం జగన్‌తో కెసిఆర్, కెటిఆర్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని కొనియాడారు. వైసిపి కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతోందని కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ కార్యకర్తలపై కూడా రేవంత్ రెడి ప్రభుత్వం అక్రమం కేసులు పెడుతుందని దుయ్యబట్టారు. గత అసెంబ్లీ ఎన్నికలలో కెసిఆర్ 39 సీట్లు సాధించి అధికారానికి దూరమైన విషయం తెలిసిందే. జగన్ 11 సీట్లు గెలిచి ఘోరమైన పరాజయంపాలైన విషయం విధితమే.