Reading Time: 2 minutes

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’మన శంకర వర ప్రసాద్ గారు’ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ’మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

సాహు గారపాటి మాట్లాడుతూ “ట్రైలర్‌ను చిరంజీవి, వెంకటేష్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియా నుంచి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. ట్రైలర్‌లో చిరంజీవి క్యారెక్టర్‌కి సంబంధించి షేడ్స్ చూపించాం. ఆయన క్యారెక్టర్‌లో ఫన్, యాక్షన్, ఎమోషన్… అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయి. వెంకటేష్, చిరంజీవి మధ్య చాలా అద్భుతమైన కామెడీ సీన్స్ వుంటాయి. ట్రైలర్ లో చిరంజీవి క్యారెక్టర్ ని పరిచయం మాత్రమే చేశాం. సినిమాలో చాలా వుంది. ఈ సినిమా సంక్రాంతి విందు అనేది చిన్న మాట.. సినిమా చూశాను కాబట్టి చెబుతున్నాను. అద్భుతంగా వుంటుంది. -ప్రస్తుతం చిరంజీవి పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్‌లో బిజీగా వున్నారు. బుధవారం నుంచి ఆయన వర్క్ అయిపోతుంది. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ వస్తున్నారు. ఇందులో ఒక స్పెషల్ సాంగ్ వుంది. అందులో వింటేజ్ చిరంజీవిని చూస్తారు. చిరంజీవి, అనిల్ రావిపూడి కలిస్తే ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ వుంటుందో అదంతా ఈ సినిమాలో చూస్తారు. భీమ్స్ -మ్యూజిక్ అద్భుతంగా చేశారు. పాటలు పెద్ద హిట్ అయ్యాయి. రీరికార్డింగ్ కూడా అదిరిపోతుంది”అని అన్నారు.

సుస్మిత కొణిదెల మాట్లాడుతూ “ఇది మైల్ స్టోన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ చేయడం ఒగ గౌరవంగా భావిస్తున్నాము. నాన్నగారి కోర్ జానర్‌లో సినిమా చేయడం, అనిల్ ఆ జానర్ ని తీసుకోవడం సూపర్బ్. సాహుతో జర్నీ బ్యూటీఫుల్. -ఈ సినిమాతో నాన్న గారు ఒక కొత్త ట్యాలెంట్ బాక్స్‌ని ఓపెన్ చేసినట్లుగా అనిపించింది. రౌడీ అల్లుడు సినిమాలో చూసినట్లుగా వుందని ఫ్యాన్స్ అంటున్నారు. వింటేజ్ ఛార్మ్ ని గుర్తు చేస్తునే ఇందులో ఆయన నటన చాలా ఫ్రెష్‌గా వుంటుంది. -ఈ సినిమా కోసం నాన్న గారు బరువు తగ్గడంతో పాటు ఫిట్ నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. చాలా కొత్త ఛార్మ్ తో కనిపించారు. దీంతో ఆయనకి కాస్టూమ్స్ డిజైన్ చేయడం కూడా మాకు సులభమైంది. అలాగే అనిల్ ఆయన్ని ఒక స్టయిల్‌లో చూపించాలని అనుకున్నారు. అందరం ఒకే విజన్ తో పని చేశాం. -సినిమాలో వెంకటేష్ వచ్చిన తర్వాత వినోదం మరింతగా పెరుగుతుంది. ఆయనది చాలా ముఖ్యమైన పాత్ర. చాలా ఎంటర్‌టైన్‌మెంట్ వున్న రిచ్ క్యారెక్టర్. -ప్రతి సీన్‌లో ఆడియన్స్ ముఖంలో చిరునవ్వు వుంటుంది” అని తెలిపారు.