
సగర్ ఐలాండ్ (పశ్చిమబెంగాల్ ): రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కమిషన్ కొనసాగిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ( సర్)కు వ్యతిరేకంగా మంగళవారం కోర్టుకు వెళ్తానని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సోమవారం హెచ్చరించారు. ఈ ప్రక్రియ భయాందోళనలు వేధింపు, ఏకపక్ష నిర్ణయాలతో మరణాలకు, అస్వస్తులై ఆస్పత్రి పాలవ్వడానికి దారి తీస్తోందని ఆమె ఆరోపించారు. దక్షిణ 24 పరగణాల్లో సగర్ ఐలాండ్ లో బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితాల్లోంచి ఎలాంటి సరైన కారణాలు లేకుండా ఓటర్ల పేర్లను ఏకపక్ష నిర్ణయాలతో తొలగిస్తున్నారని , దీంతో సాధారణంగా జరగాల్సిన ఈ ప్రక్రియ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు భయాందోళనలకు దారి తీస్తోందని విమర్శించారు. ఈ అమానవీయ విధానం, ఎస్‌ఐఆర్ వల్ల అనేక మంది మరణాలకు దారి తీయడం వీటన్నిటికీ వ్యతిరేకంగా మంగళవారం కోర్టుకు వెళ్తానని అప్పటికీ ఈ ప్రక్రియ సాగుతుంటే సుప్రీం కోర్టుకైనా సరే వెళ్తానని, తాను కూడా శిక్షణ పొందిన న్యాయవాదినేనని మమతాబెనర్జీ పేర్కొన్నారు.
కోర్టుకు వ్యక్తిగతంగానా లేక, రాష్ట్ర ప్రభుత్వం లేదా తృణమూల్ కాంగ్రెస్ తరఫున పిటిషన్ దాఖలు చేస్తారా అన్నది వివరించలేదు. తాము చట్టబద్దమైన ఓటర్లమేనని నిరూపించుకోవడానికి అస్వస్థులైన వారు, వయోవృద్ధులు, బలవంతంగా భారీ క్యూలలో పడిగాపులు పడవలసి వస్తుందని ఆరోరపించారు. తమ వయో వృద్ధులను గుర్తింపు నిరూపించుకోవడానికి క్యూలలో నిలబడేలా ఎవరో ఒకరు చేస్తే బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని వ్యాఖ్యానించారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే వలసవాదులపై విచక్షణ చూపించడాన్ని కూడా మమత విమర్శించారు. “వారు నన్ను చంపమనండి.అయినా సరే నా మాతృభాష బెంగాల్‌లో మాట్లాడడం మానేయను ” అని వ్యాఖ్యానించారు.
దేశంలో బెంగాల్ మాట్లాడడం నేరమైందా ? అని ప్రశ్నించారు. బీజేపీ ఎన్నికల ముందు ఓటర్లను ఊరించడానికి అనేక వరాలు ప్రకటిస్తుందని, ఎన్నికల్లో గెలిచిన తరువాత అణగదొక్కడానికి ప్రయత్నిస్తారని విమర్శించారు. ఎన్నికల ముందు ఓటరుకు రూ.10 వేలు వంతున ఇస్తారని, ఆ తరువాత బుల్‌డోజర్ ఉపయోగిస్తారని ధ్వజమెత్తారు. “నీవెంత కావాలంటే అంత హింసించినా సరే దానివల్ల ఫలితాలు ఏవీ రావు” అని వ్యాఖ్యానించారు.