Reading Time: < 1 minute

కృత్రిమ మేథ (ఎఐ) అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి దాని వల్ల ఎన్ని ఉపయోగాలు వచ్చాయో.. అంతే ప్రమాదాలు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కొందరు ఎఐని తీవ్రస్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారు. ఎఐని ఉపయోగించి చాలా మంది సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేస్తున్నారు. తాజాగా మహిళ ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యురాలైన ప్రతీకా రావల్‌కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఎక్ప్‌కి సంబంధించిన ఎఐ టూల్ ‘గ్రోక్’ సాయంతో ప్రతీకా ఫోటోలను ఎడిటింగ్ చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు కొందరు వ్యక్తులు. అవి కాస్త వైరల్ అయ్యాయి. దీంతో ప్రతీకా చాలా సీరియస్‌గా స్పందించింది.

‘‘నాకు సంబంధించిన ఫోటోలను ఎడిట్ చేయడానికి గ్రోక్‌కు ఎలాంటి అధికారం లేదు. నా ఫోటోలను ఎడిట్ చేయాలని ఏదైనా థర్డ్ పార్టీ అడిగితే.. వెంటనే ఆ అభ్యర్థనను తిరస్కరించండి’’ అని ప్రతీకా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఇటీవల ముగిసిన మహిళ వన్డే ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచేందుకు ప్రతీకా ఎంతో కృషి చేసింది. ఈ టోర్నమెంట్‌లో భారత్ తరఫున రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచింది. ఆరు ఇన్నింగ్స్‌లో 51.33 సగటుతో 308 పరుగులు చేసింది. అయితే సెమీస్‌కి ముందు గాయం కారణంగా మిగితా టోర్నమెంట్‌కు దూరమైంది.