
గువాహటి/మోరిగావ్ : సెంట్రల్ అస్సాంలో మోరిగావ్ జిల్లాలో సోమవారం తెల్లవారు జామున 4.17 గంటలకు 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూ అంతర్భాగంలో 50 కిమీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీని ప్రభావం కేవలం అస్సాంకే పరిమితం కాకుండా మేఘాలయ, మణిపూర్, పశ్చిమబెంగాల్‌తోపాటు భూటాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోనూ కనిపించింది. గాఢ నిద్రలో ఉండగా ఈ భూకంపం సంభవించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. మోరిగావ్‌లో కొంతమంది గాయపడ్డారు. మిఖిర్‌భేటా సర్కిల్ లోని నా డల్బోరి గ్రామంలో 80 ఏళ్ల జోయ్ మోతీ దేవ్రీ , మనోజ్‌కుమార్ అనే ఇద్దరు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. ఇళ్లల్లో వస్తువులు చెల్లాచెదురయ్యాయి.