
ములుగు, వెలుగు: ములుగులోని సమ్మక్క సారక్క జాతీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని మంగళవారం హైదరాబాద్ ఎయిమ్స్ సీనియర్ వైద్య బృందం సందర్శించింది. ములుగు మండలం జాకారంలోని వైటీసీలో నిర్వహిస్తున్న గిరిజన యూనివర్సిటీ వీసీ వైఎల్ శ్రీనివాస్‌ను ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ రాహుల్ నరేన్ తో పాటు ఆరుగురు డాక్టర్లు పలు అంశాలపై చర్చించారు.
వీసీ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ఆరోగ్య సేవలను మెరుగు పర్చేందుకు యూనివర్సిటీని నోడల్ కేంద్రంగా చేసుకొని పలు కార్యక్రమాలు ప్రారంభించాలని సూచించారు. ఇందుకోసం మెడికల్ సైన్సెస్ లో సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించాలని కోరారు. త్వరలోనే ఏఐఐఎంఎస్ హైదరాబాద్, ములుగు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు టెక్నాలజీ అందించేందుకు చర్చలు జరుపుతామని చెప్పారు.