
జకార్తా: ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 14 మంది మృతి చెందారు. 84 మందికి పైగా గాయపడ్డారు. రైళ్లలో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించేందుకు సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. సోమవారం రాత్రి పొద్దుపోయాక జకార్తాకు ఆనుకుని ఉన్న బెకాసి నగర రైల్వే స్టేషన్‌లో ఒక కమ్యూటర్ లైన్ రైలుకు, మరో రైలుకు మధ్య ఈ ప్రమాదం జరిగింది.
రైలు బోగీలకు చాలా వరకూ నుజ్జునుజ్జు అయినట్లు ఈ ప్రమాదం తర్వాత దృశ్యాలు చూస్తే స్పష్టమైంది. రైళ్లలో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించే ప్రయత్నాలు సంక్లిష్టంగా మారాయి. రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. శిథిలాలను తొలగించి, నుజ్జునుజ్జు అయిన బోగీలలో చిక్కుకున్న వారిని విడిపించడానికి ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్స్ శాయశక్తులా పనిచేస్తున్నాయి.
సహాయక సిబ్బంది రైళ్లను వేరు చేసి.. ప్రయాణికులను విడిపించడానికి కంపార్ట్‌మెంట్లను యాంగిల్ గ్రైండర్లతో కత్తిరిస్తున్నారు. రైల్వే క్రాసింగ్ మధ్యలో అడ్డంగా పడి ఉన్న ట్యాక్సీని ఒక రైలు ఢీ కొట్టింది. ఈ ఘటన కారణంగా మరో రైలు స్టేషన్‌లో ఆగవలసి వచ్చింది.
దాదాపు గంట తర్వాత.. స్టేషన్ నుంచి బయల్దేరుతుండగా ట్యాక్సీని ఢీ కొట్టిన రైలు దూసుకొచ్చి ఈ రైలును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు రైళ్లలో చాలా వరకూ బోగీలు నుజ్జునుజ్జు కావడం గమనార్హం. జనవరి 2024లో కూడా ఇండోనేషియాలోని సికలెంకాలోని ఒక వరి పొలం దగ్గర రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో పలువురు మరణించిన సంగతి తెలిసిందే.