
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో మరో అరుదైన మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్లో 9 వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 19లో భాగంగా సోమవారం (ఏప్రిల్ 27) అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో ఈ రేర్ ఫీట్ నెలకొల్పాడు. 274 మ్యాచ్‌లలో ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్లో కోహ్లీ 134 స్ట్రైక్ రేట్, 40 సగటుతో ఇప్పటి వరకు 8 సెంచరీలు, 66 హాఫ్ సెంచరీలు చేశాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లీ (9,012) తర్వాత రోహిత్ శర్మ (7,183), శిఖర్ ధావన్ (6,769), డేవిడ్ వార్నర్ (6,565), కేఎల్ రాహుల్ (5,579) ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను (DC) 9 వికెట్ల తేడాతో మట్టికరిపించి ఆర్‌సీబీ రికార్డు విజయాన్ని నమోదు చేసింది. కేవలం 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.
ఈ మ్యాచులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆరంభం నుంచే వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి ఏ ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. యువ ప్లేయర్ అభిషేక్ పోరెల్ (30 పరుగులు) ఒక్కడే పోరాటం చేసినా, మిగిలిన వారు చేతులెత్తేయడంతో ఢిల్లీ 16.3 ఓవర్లలో కేవలం 75 పరుగులకే కుప్పకూలింది. 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ 6.3 ఓవర్లలోనే ఛేధించింది. జాకబ్ బెతేల్ (20), కోహ్లీ (23), పడిక్కల్ (34) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీకి రికార్డ్ విజయాన్ని అందించారు.