
ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న కీలక పోరులో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పాటిదార్ ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. దీంతో ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి రాబోతుంది. ఈ మ్యాచులో భారీ స్కోర్ చేసి ఆర్సీబీపై మరో విజయం నమోదు చేసుకోవాలని డీసీ చూస్తుండగా, గత మ్యాచులో ఓడించిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలని బెంగళూరు జట్టు ప్లాన్ వేసింది.
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. ఈ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలమైంది, భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉన్నందున ఛేజింగ్‌ను మొగ్గు చూపినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ వేర్వేరు మ్యాచ్‌ల్లో రాణిస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్నారని, అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. గత విజయాలను పక్కన పెట్టి, ఈ రాత్రి అత్యుత్తమ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని బెంగళూరు కెప్టెన్ స్పష్టం చేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ (DC) కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. తాను కూడా టాస్ గెలిస్తే బౌలింగే ఎంచుకునేవాడినని తెలిపాడు. చిన్న మైదానం కావడం, రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ మరింత మెరుగుపడే అవకాశం ఉండటమే అందుకు కారణమని అభిప్రాయపడ్డాడు. గత మ్యాచ్‌లో 264 పరుగులు చేసినా ఓడిపోవడం బాధాకరమని, అయితే ఇది సుదీర్ఘమైన టోర్నమెంట్ కాబట్టి అలాంటి ఫలితాలు సహజమేనని పేర్కొన్నాడు. ఫీల్డింగ్‌లో అవకాశాలను అందిపుచ్చుకుంటే ఫలితం మరోలా ఉండేదని, జట్టులోని అత్యుత్తమ ఫీల్డర్లు కూడా కొన్నిసార్లు క్యాచ్‌లు వదిలేస్తుంటారని, అది తమ దురదృష్టమని అక్షర్ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టు చమీరా, జేమీసన్ లని తుది జట్టులోకి వస్తున్నట్లు తెలిపాడు.
తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: సాహిల్ పరాఖ్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(కెప్టెన్), దుష్మంత చమీరా, కైల్ జామీసన్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్