
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. సోమవారం (ఏప్రిల్ 27) తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగం సహా ఇతర అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా నిలబెట్టాం. కానీ ఈ ప్రభుత్వం భూముల కబ్జాలలో నెంబర్ వన్, కూలగొట్టడంలో నెంబర్ వన్‌గా నిలబెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.
కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి భూముల కబ్జాలకు కాంగ్రెస్ పాల్పడుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయలేని చేతకాని స్థితిలో ప్రభుత్వం ఉన్నదని.. ధాన్యం కొనుగోళ్లపైన కూడా మంత్రివర్గం చర్చించాలా..? నేరుగా కొంటే సరిపోతుందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు లేకపోవడంతో రైతన్నలు పడుతున్న ఇబ్బందులపై వార్తలు చూస్తే బాధ అవుతుందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న రైతన్నలను చూసి నా గుండె తరుక్కుపోతున్నదన్నారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఏర్పాటుకు ముందున్న దయనీయమైన వ్యవసాయ రంగ పరిస్థితి మళ్ళీ రాష్ట్రంలో వస్తున్నదని.. రైతన్నలు, వ్యవసాయ రంగం సంక్షోభం దిశగా పోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం మిషన్ భగీరథ పథకాన్ని నడపడం కూడా చేతనవ్వడం లేదని విమర్శించారు. పల్లె పల్లెనా పల్లెరులు మురిసే తెలంగాణలోనా అన్న పరిస్థితి కాంగ్రెస్ పాలనలో మళ్లీ వచ్చిందన్నారు.
చిల్లర కూతలు, చిల్లర మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, మంత్రులను చూస్తే జాలి వేస్తుందన్నారు. రెండున్నర సంవత్సరాల పాటు అంబేద్కర్‌ని బంధించిన మూర్ఖపు చండాలపు ప్రభుత్వమని ఘాటు విమర్శలు చేశారు. రెండున్నర సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ బయట, అసెంబ్లీలో బలంగా కొట్లాడుతున్నదని అన్నారు.
ఉద్యమ సమయంలో హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఏర్పాటు చేసే అంశంలో కొంత రాజీ పడాలని సోనియా గాంధీ అనేకసార్లు సూచించారని.. కానీ హైదరాబాద్ లేకుండా తెలంగాణ తీసుకోమని.. ఇందులో రాజీ పడలేదని తేల్చిచెప్పి హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను సాధించుకున్నామని పేర్కొన్నారు. 2009 లో చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించేందుకే అప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఎన్నో సందర్భాల్లో నన్ను మానసిక క్షోభకు గురి చేశారని.. కానీ ఎక్కడా వెనకడుగు వేయకుండా ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామన్నారు.