
Rinku Singh: ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా లక్నోలోని ఎకానా స్టేడియంలో ఓ అద్భుతమైన పోరాటం జరిగింది. లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కేకేఆర్ గెలిచింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన రింకూ సింగ్.. బ్యాట్‌తో పరుగుల సునామీ సృష్టించి జట్టును గట్టెక్కించాడు. కానీ ఈ ఆనంద సమయంలో రింకూ సింగ్ కుటుంబంలో నెలకొన్న ఓ విషాద ఘటన అందరినీ తీవ్రంగా కలచివేసింది. గ్రౌండ్ లో రింకూ సింగ్ అద్భుతంగా రాణిస్తుంటే, స్టాండ్స్‌లో ఉన్న ఆయనకి కాబోయే భార్య ప్రియా సరోజ్ తన మామగారిని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది.
ఇక మ్యాచ్ గెలిచిన తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ అధికారిక సోషల్ మీడియా వేదికగా ఓ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. అందులో ప్రియా సరోజ్ మాట్లాడుతూ.. ఎంతో భావోద్వేగానికి లోనయింది. రింకూ ఆడిన ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ నా మామగారికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విజయాన్ని చూసి ఆయన ఎంతో గర్వపడేవారు.. నిజానికి ఈ క్షణాన మేమందరం ఆయనని చాలా మిస్సవుతున్నాం అని పేర్కొనింది. రింకూ సింగ్ తండ్రి ఖాన్‌చంద్ సింగ్ గత ఫిబ్రవరిలో లివర్ క్యాన్సర్ తో తుదిశ్వాస విడిచాడు. తండ్రి చనిపోయిన కొద్ది నెలలకే రింకూ పట్టుదలతో స్టేడియంలోకి వచ్చి ఇలాంటి ప్రదర్శన చేయడం చూసి అభిమానులు సెల్యూట్ చేస్తున్నారు.
కాగా ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ వైస్ కెప్టెన్‌గా రింకూ సింగ్ తన హోదాకు తగ్గట్టుగా పోరాటం చేశాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే షాక్‌లు తగిలాయి. వరుసగా వికెట్లు కోల్పోతున్నప్పటికీ, క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ లక్నో బౌలర్లను సమర్దంగా ఎదుర్కొన్నాడు. కేవలం 51 బంతుల్లోనే 83 రన్స్ తో నాటౌట్‌గా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో స్టేడియాన్ని అలరించాడు. రింకూ సింగ్ పోరాటంతోనే కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 రన్స్ స్కోర్ చేసింది. ఇక మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగి ‘టై’ కావడంతో.. సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ సూపర్ ఓవర్ ఒత్తిడి పతాక స్థాయికి చేరడంతో.. రింకూ సింగ్ మళ్లీ బ్యాట్ పట్టుకుని జట్టుకి అద్భుతమైన విజయాన్ని అందించాడు.
What it’s all about 🤌💜 pic.twitter.com/t4l5Rb3zMj
— KolkataKnightRiders (@KKRiders) April 26, 2026