Reading Time: 2 minutes

అద్దె ఇంట్లో ఉండటం బెటరా? సొంతిల్లు కొనుక్కోవటం మంచిదా? ప్రాపర్టీ రేట్లు పెరుగుతున్న వేళ ఏది బెస్ట్

Caption of Image.

సొంతిల్లు అనేది ప్రతి సామాన్యుడి కల మాత్రమే కాదు.. అది ఒక ఎమోషన్. కానీ ప్రస్తుతం ఇండియాలోని మెట్రో నగరాల్లో, ముఖ్యంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకప్పుడు ఇల్లు కొనడం అంటే జీవితమంతా కష్టపడాలని భావించేవారు. కానీ నేడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆకాశాన్ని తాకుతున్న ప్రాపర్టీ రేట్లు మధ్యతరగతి ప్రజలను తీవ్ర ఆలోచనలో పడేశాయి. రూ.50 లక్షల నుంచి మొదలై రూ.25 కోట్ల వరకు పలుకుతున్న ఫ్లాట్ల ధరలు చూస్తుంటే.. అసలు ఇల్లు కొనాలా? లేక అద్దె ఇంట్లోనే కాలం వెళ్లదీయం బెటరా? అనే సందిగ్ధంలో జనం ఉన్నారు.

అద్దెకు ఉండటం అనేది ఆర్థికంగా కొంత ఉపశమనాన్ని ఇస్తుందని చాలామంది భావిస్తారు. నెలకు రూ.30వేలు అద్దె కట్టడం, రూ.50వేలు ఈఎంఐ కట్టడం కంటే ఈజీగా అనిపించవచ్చు. నోయిడా, గురుగ్రామ్ వంటి ఐటీ హబ్‌లలో నివసించే వారు ఈఎంఐల ఉచ్చులో పడకుండా ఉండేందుకు అద్దె ఇంట్లో ఉండటాన్నే ఎంచుకుంటున్నారు. అయితే అద్దె ఇల్లు అనేది ఆస్తిని సృష్టించదు. అది కేవలం ప్రతి నెలా అయ్యే ఖర్చు మాత్రమే. పైగా ఏటా పెరిగే అద్దెలు భవిష్యత్తులో మరింత భారంగా మారే అవకాశం ఉంది. అద్దె ఇంట్లో ఉండటం స్టార్టింగ్ చౌకగా అనిపించినా.. దీర్ఘకాలంలో అది ఆర్థికంగా ఎటువంటి ప్రయోజనాన్ని ఇవ్వబోదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హోమ్ లోన్ అనేది సుదీర్ఘకాలం పాటు కొనసాగే ఒక ఆర్థిక భారం. ఇది ఆస్తి సృష్టికి పునాది వేస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగేకొద్దీ ప్రాపర్టీ ధరలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఈ రోజు మీరు కట్టే ఈఎంఐ భవిష్యత్తులో ఒక గొప్ప పెట్టుబడిగా మారుతుంది. అయితే ఇల్లు కొనే ముందు ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం.  నెలవారీ ఆదాయంలో ఈఎంఐ వాటా 30 నుండి 40 శాతానికి మించకూడదని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. అప్పుడే ఇతర ఖర్చులకు ఇబ్బంది లేకుండా జీవించగలుగుతారు. ఆదాయం స్థిరంగా ఉండి.. వచ్చే 10-15 ఏళ్ల పాటు ఎటువంటి ఆటంకం ఉండదు అనుకున్నప్పుడు ఇల్లు కొనడం సరైన నిర్ణయం అంటున్నారు వారు.

చివరగా మీరు ఉండే నగరం.. కాలపరిమితి కూడా నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. మీరు ఉద్యోగ రీత్యా తరచూ ఇతర నగరాలకు మారే అవకాశం ఉంటే అద్దె ఇంట్లో ఉండటమే మేలు. కనీసం 7 నుండి 10 సంవత్సరాల పాటు ఒకే చోట స్థిరపడాలని భావిస్తే మాత్రం ఇల్లు కొనడమే తెలివైన పని. అద్దె కట్టి మరొకరి ఆస్తిని పెంచే బదులు.. కొంచెం కష్టమైనా ఈఎంఐ కడితే అది మీకు సొంత ఆస్తిగా మిగులుతుంది. కాబట్టి ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను, మీ వ్యక్తిగత లక్ష్యాలను బట్టి సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది. 

©️ VIL Media Pvt Ltd.