Reading Time: 2 minutes

రింకు హాఫ్ సెంచరీ.. కేకేఆర్పై మొహ్సిన్ ఖాన్ పంజా.. లక్నో ముందు స్వల్ప టార్గెట్! 

Caption of Image.

LSG vs KKR: ఏకనా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న పోరు ఉత్కంఠకు తెరలేపింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో ఒకవైపు లక్నో పేసర్ మొహ్సిన్ ఖాన్ నిప్పులు చెరిగే బంతులతో కేకేఆర్ నడ్డి విరచగా, మరోవైపు ఆఖరి నిమిషాల్లో రింకూ సింగ్ సిక్సర్ల వర్షం కురిపించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.

కోల్‌కతా ఇన్నింగ్స్ ఆరంభం నుంచే లక్నో బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. ముఖ్యంగా మొహ్సిన్ ఖాన్ తన రెండో ఓవర్లోనే టైమ్ సీఫెర్ట్‌ను డకౌట్ చేసి కేకేఆర్‌కు గట్టి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత అజింక్య రహానే నిలకడగా ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ 10 పరుగుల వద్దే మొహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. హార్డ్ హిట్టర్ రోవ్‌మన్ పావెల్ సైతం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరడంతో కేకేఆర్ 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇదే క్రమంలో అంగ్‌క్రిష్ రఘువంశీ ‘అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ రూపంలో అవుట్ కావడం వివాదాస్పదంగా మారింది. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించిన కామెరాన్ గ్రీన్ 34 పరుగులు చేసి ఊపుమీద ఉన్న తరుణంలో మొహ్సిన్ ఖాన్ అతడిని కూడా అవుట్ చేయగా, ఆ తర్వాతి బంతికే అనుకూల్ రాయ్‌ను డకౌట్ చేయడంతో మొహ్సిన్ ఖాన్ కేవలం 23 పరుగులిచ్చి 5 వికెట్లతో కేకేఆర్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు.

అయితే వరుసగా వికెట్లు పడుతున్నా వెనక్కి తగ్గని రింకూ సింగ్ తన అద్భుతమైన పోరాటంతో జట్టును గట్టెక్కించాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 83 పరుగులు చేసిన రింకూ, ముఖ్యంగా దిగ్వేష్ రాఠే వేసిన చివరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ కారణంగానే కోల్‌కతా 155 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది. లక్నో బౌలర్లలో మొహ్సిన్ ఖాన్ ఐదు వికెట్లతో చెలరేగగా, జార్జ్ లిండే ఒక వికెట్ పడగొట్టాడు. ఇప్పుడు 156 పరుగుల లక్ష్యంతో లక్నో సూపర్ జెయింట్స్ బరిలోకి దిగనుంది. 

©️ VIL Media Pvt Ltd.