
షాపుకు వెళ్లి ఏం కొందాంలే.. ఆన్ లైన్ లో బుక్ చేస్తే సరిపోతుంది.. అనుకునే వాళ్లకు ఇది కాస్త అలర్ట్ లాంటిదే. ముంబైలో ఒక నర్స్ 299 రూపాయల డ్రెస్ బుక్ చేసే క్రమంలో.. ఏకంగా లక్ష రూపాయలు లాస్ అయ్యింది. ఆన్ లైన్ ఫ్రాడ్ ఎంత ఈజీగా జరుగుతుందో ఇదొక ఉదాహరణ.
ముంబై పోలీసులు చెప్పిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఫేస్ బుక్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా.. వాట్సాప్ నంబర్ తో.. ఫేక్ ఏజెంట్ ఈ ఫ్రాడ్ కు పాల్పడినట్లు చెప్పారు.
ముంబైలో హాస్టల్ లో ఉండే ఒక నర్స్.. ఫేస్ బుక్ యాడ్ చూసి.. ఆఫర్ బాగుందని డ్రెస్ ఆర్డర్ చేసిందట. 299 రూపాయలకు ఒక డ్రెస్ అంటే కొందామని ట్రై చేసిందట.
- మోసం ఎలా జరిగిందంటే..
డ్రెస్ ఆర్డర్ చేశాక పేమెంట్ చేసే టైమ్ లో.. ఛార్జీల పేరున ఎక్కవ వసూలు చేశారు దుండగులు. షాపింగ్ ఛార్జీలు, జీపీఎస్ ఛార్జీలు, ట్రాకింగ్ ఫీజు అంటూ అదనంగా డబ్బు వసూలు చేశారు. ఆ తర్వాత.. కన్ఫర్మేషన్ కోడ్స్, అడ్రస్ కన్ఫర్మేషన్ పేర ఆమెను లూటీ చేశారని పోలీసులు తెలిపారు.
ఏప్రిల్ 16 నుంచి 20వ తేదీ మధ్యన 5 రోజుల గ్యాప్ లో లక్ష రూపాయలు చెల్లించింది. ఆ ఫీజు ఈ ఫీజు అని.. మనీ రీఫండ్ అవుతుందని నమ్మించి లక్ష వరకు గుంజేశారు. అయితే మనీ రీఫండ్ కాకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కంప్లైంట్ చేసింది. కేసు రిజిస్టర్ చేసిన దియోనార్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.