
ఆయిల్ టార్గెట్ అయిపోయింది.. గ్యాస్ పై ఎటాక్ అయిపోయింది.. ఈ రెండింటి దెబ్బకే ఆసియా దేశాలు విలవిలలాడుతున్నాయి. అమ్మ బాబోయ్ అంటున్నాయి., అయినా అణువంత వెనక్కి తగ్గటం లేదు ఇరాన్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చే వార్నింగ్స్ ను లెక్కచేయటం లేదు ఇరాన్. ఆయిల్, గ్యాస్ కట్ చేస్తేనే.. హర్మూజ్ జల సంధిని దిగ్బంధిస్తేనే ఆసియా దేశాలు విలవిలలాడుతుంటే.. ఇప్పుడు ఇరాన్ ఇస్తున్న వార్నింగ్ తో ఇప్పుడు ప్రపంచమే అమ్మ బాబోయే అనే రోజులు రాబోతున్నాయి. సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ కేబుళ్లను నాశనం చేస్తాం.. ఇంటర్నెట్ కేబుళ్లను కట్ చేస్తాం అంటూ ఇరాన్ ఇస్తున్న వార్నింగ్స్ తో ఐటీ కంపెనీలు అన్నీ అల్లాడిపోతున్నాయి.. ఇదే జరిగితే ప్రపంచం ఏం కావాలి.. అల్లకల్లోలమేనా అనే భయం ఇప్పుడు ప్రపంచ దేశాలను వెంటాడుతున్నాయి. కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి.
పెట్రోల్ మంటలు ఒకవైపు సామాన్యుడిని వేధిస్తుంటే.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని డిజిటల్ చీకటిలోకి నెట్టేసే మరో పెను ప్రమాదం ముంచుకొస్తోంది. వ్యూహం మార్చిన ఇరాన్ కేవలం చమురు నౌకలే కాక.. ఇకపై సముద్ర గర్భంలో ఉండే ఇంటర్నెట్ కేబుల్స్ తన తర్వాతి టార్గెట్ అంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ పరోక్ష సంకేతాలు ఇచ్చింది. ఇది జరిగితే.. మనం వాడుతున్న వాట్సాప్, యూట్యూబ్ నుంచి బ్యాంకింగ్ వ్యవస్థల వరకు అన్నీ నిలిచిపోయే ప్రమాదం ఉంది.
ALSO READ : ఎన్నికల తర్వాత ప్రజలపై పెట్రోల్ బాంబు
డిజిటల్ వెన్నెముకపై వేటు..
ప్రపంచవ్యాప్తంగా డేటా ప్రయాణించే సముద్రగర్భంలోని కేబుల్స్‌కు హార్ముజ్ జలసంధి కీలక కూడలి. యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాలను కలిపే ఈ కేబుల్స్ ఇప్పుడు ఇరాన్ టార్గెట్‌లో ఉన్నాయి. ఈ కేబుల్స్ లేదా క్లౌడ్ నెట్‌వర్క్‌లపై చిన్న దాడి జరిగినా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వ్యవస్థ కుప్పకూలుతుందని ఇరాన్ అనుబంధ మీడియా కథనాల హెచ్చరించాయి. ఒకవేళ ఇరాన్ ఈ కేబుల్స్‌ను కట్ చేస్తే.. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఆర్థిక లావాదేవీలు ఆగిపోయి, స్టాక్ మార్కెట్లు కుప్పకూలి, ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోతాయి.
యుద్ధం.. సముద్రం లోపల
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అస్థిరంగా ఉన్న తరుణంలో ఈ హెచ్చరికలు రావడం గమనార్హం. బుధవారం ఇరాన్ 3 నౌకలపై కాల్పులు జరిపి, రెండింటిని స్వాధీనం చేసుకుంది. ట్రంప్ కాల్పుల విరమణను పొడిగించినా.. ఇరాన్ పోర్టులపై ఆంక్షలు కొనసాగుతుండటంతో ఇరాన్ ఆగ్రహంతో ఉంది. ఒకవేళ ఈ కోపం ఇంటర్నెట్ కేబుల్స్ వైపు మళ్లితే.. ప్రపంచం కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్లిపోవడం ఖాయం అంటున్నారు నిపుణులు. సో సముద్ర గర్భంలో దాగి ఉన్న ఈ డిజిటల్ బాంబు ఎప్పుడు పేలుతుందో అని ప్రపంచం వణికిపోతోంది.