
- బీజేపీ ఎంపీ రఘునందన్ రావు
న్యూఢిల్లీ, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ వేర్వేరు కాదని, వారిద్దరి మధ్య జరుగుతున్నది కేవలం ‘డూప్ ఫైట్’ మాత్రమేనని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాస్తే, తాము తక్షణమే దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
అసెంబ్లీలో కేవలం మూడు బ్యారేజీలపైనే విచారణ జరపాలని తీర్మానం చేయడం రేవంత్ చిత్తశుద్ధిని శంకిస్తోందని, మొత్తం ప్రాజెక్టుపై విచారణ జరపాలన్నదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. తెలంగాణలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కూడా కేసీఆర్ కుటుంబంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక లోతైన ఒప్పందం ఉందని రఘునందన్ రావు ఆరోపించారు.