
LSG vs RR: ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని ఏకనా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో మరింత హీటెక్కుతోంది. 160 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు రాజస్థాన్ రాయల్స్ (RR) బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. RR బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ మొత్తం పేకమేడలా కూలిపోయింది. ముఖ్యంగా కెప్టెన్ రిషబ్ పంత్, బదోనీ, మార్క్రమ్ సహా కీలక ఆటగాళ్లు చేతులెత్తేయడంతో లక్నో అభిమానులు షాక్‌లో ఉన్నారు.
ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన ఆయూష్ బదోనీ మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు. లక్నో జట్టు 9 పరుగులు చేసిన తర్వాత దురదృష్టవశాత్తూ బదోనీ (0) రనౌట్ కావడంతో గోల్డెన్ డక్ తరహాలోనే వెనుదిరగాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్ పడటంతో లక్నో ఒత్తిడిలో పడింది. బదోనీ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఆశించారు. కానీ, నాండ్రే బర్గర్ వేసిన బుల్లెట్ లాంటి బంతికి కీపర్ ధ్రువ్ జురెల్ కు క్యాచ్ ఇచ్చి పంత్ కేవలం 3 బంతుల్లోనే డకౌట్ అయి పెవిలియన్ కి చేరాడు.
Also Read ; లక్నో బౌలర్ల ధాటికి రాజస్థాన్ విలవిల
ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఐడెన్ మార్క్రమ్ కూడా అదే బాట పట్టాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన షార్ట్ పిచ్ బంతిని ఎదుర్కోవడంలో తడబడిన అతడు.. కీపర్ జురెల్‌కే క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. కేవలం 11 పరుగులకే ముగ్గురు కీలక బ్యాటర్లు డకౌట్ కావడంతో.. లక్నో పీకల్లోతు కష్టాల్లో పడింది. రాజస్థాన్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ నిప్పులు చెరిగే బంతులతో లక్నో బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ప్రస్తుతం లక్నో జట్టును ఆదుకునే బాధ్యత మిడిలార్డర్ పైనే ఉంది. 160 పరుగుల టార్గెట్ చిన్నదే అయినా, రాజస్థాన్ బౌలర్ల జోరు చూస్తుంటే మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠగా సాగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం క్రీజులో నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ ఉన్నారు.