Reading Time: < 1 minute

పెళ్లయిపోయింది.. అప్పగింతల వీడియో తీస్తుండగా ఘోరం.. పాపం కెమెరామెన్ !

Caption of Image.

సిర్సా: హర్యానాలోని సిర్సాలో పెళ్లి కూతురి వీడ్కోలు కార్యక్రమం ఒక దిగ్భ్రాంతికరమైన ప్రమాదంగా మారింది. పెళ్లికూతురి వీడ్కోలు కోసం ఇరు కుటుంబాల బంధువులు, సన్నిహితులు రోడ్డుపై గుమిగూడారు. ఫంక్షన్ హాల్ మెయిన్ రోడ్డు పక్కనే ఉండటంతో రోడ్డుపై నిలబడి కెమెరామెన్ ఫొటోలు, వీడియోలు తీస్తున్నాడు. ఇంతలో ఒక కారు అతి వేగంగా వచ్చి కెమెరామెన్ను ఢీ కొట్టింది. కారు ఢీ కొట్టిన స్పీడ్కు కెమెరామెన్ గాల్లోకి ఎగిరిపడి కొంచెం దూరంలో వెళ్లి పడ్డాడు.

తెల్లవారుజామున సుమారు 6:22 గంటలకు ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ అయింది. అప్పటికీ ఆ కారును ముందే గమనించిన ఇద్దరు వ్యక్తులు అతడిని పక్కకు తప్పుకోమని సైగలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా వీడియోలో కనిపిస్తుంది. కానీ తప్పించుకోవడానికి ప్రయత్నించే లోపే ఈ ఘోరం జరిగిపోయింది.

క్షణాల్లో ఇరు కుటుంబాల్లో నెలకొన్న భావోద్వేగ క్షణాలు ఆవిరై పోయాయి. పెళ్లి సందడి కాస్తా భయానకంగా మారింది. కారు ఢీ కొట్టిన స్పీడ్కు గాలిలో దుమ్ము రేగింది. జనం కేకలు వేశారు, ఆపై ప్రమాదం జరిగిన చోట నిశ్శబ్దం అలుముకుంది. ఈ ప్రమాదం రోడ్డు భద్రతపై ప్రశ్నలను లేవనెత్తింది. ఈ ప్రమాదం రహదారి భద్రత, అవగాహనపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది.

కెమెరామెన్ మెయిన్ రోడ్డుపై వాహనాలను గమనించకుండా రద్దీగా ఉన్న రహదారిపై నిలబడి ఉన్నాడని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. డ్రైవర్ అతివేగం, నియంత్రణ కోల్పోవడం కూడా ప్రమాదానికి కారణం అని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

©️ VIL Media Pvt Ltd.