
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో చర్చలు విఫలం అవ్వడంతో బుధవారం ( ఏప్రిల్ 22 ) నుంచి సమ్మెకు పిలుపునిచింది ఆర్టీసీ జేఏసీ. ఈ క్రమంలో సమ్మె వద్దంటూ ఉద్యోగులకు పిలుపునిచ్చింది ఆర్టీసీ యాజమాన్యం. సమ్మె వద్దని..మాయమాటలు నమ్మొద్దని ఉద్యోగులకు విన్నపం చేసింది యాజమాన్యం.
టీజీఎస్ఆర్టీసీ సంస్థ ప్రయాణికుల సేవే పరమావధిగా పని చేస్తోందని.. ఇప్పటికే ఐఏఎస్ అధికారుల కమిటీతో చర్చలు ప్రారంభమయ్యాయని పేర్కొంది ఆర్టీసీ యాజమాన్యం. ఈ క్రమంలో కార్మికులంతా చట్టపరమైన అంశాలు గమనించాలని కోరింది.
సమ్మె చట్ట విరుద్ధం:
పారిశ్రామిక వివాదాల చట్టం, 1947లోని సెక్షన్ 22(1)(d) ప్రకారం, సంబంధిత అధికారి దగ్గర ఒక వివాదం పెండింగ్‌లో ఉన్నప్పుడు సమ్మెకు దిగడం చట్టవిరుద్ధమని పేర్కొంది యాజమాన్యం.
Also Read : ఆర్టీసీ బంద్..ఎలక్ట్రిక్ బస్సులు, ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయ్
జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ తో ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని.. ఈ ప్రక్రియ ముగియకముందే సమ్మెకు వెళ్లడం చట్టరీత్యా చెల్లదని తెలిపింది ఆర్టీసీ.
క్రమశిక్షణ చర్యలు:
చట్టవిరుద్ధమైన సమ్మెలో పాల్గొనడం వల్ల వేతన కోతతో పాటు, ఉద్యోగ నిబంధనల ప్రకారం కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని… ఇది కార్మికుల భవిష్యత్తుపై, వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది.
సంస్థ, కార్మికుల సంక్షేమం దృష్ట్యా, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి యాజమాన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని… ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా, సంస్థ ప్రతిష్ఠను కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొంది ఆర్టీసీ.
కార్మికులు, యూనియన్ నాయకులు, పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక పిలుపులను నమ్మవద్దని తెలిపింది ఆర్టీసీ.సిబ్బంది సమ్మెను విరమించుకుని, అందరూ యథావిధిగా తమ విధులకు హాజరు కావాలని యాజమాన్యం కోరింది ఆర్టీసీ యాజమాన్యం.