Reading Time: 2 minutes

ఐటీ నగరాల్లో ఆగిన ఇళ్ల అమ్మకాలు.. నిశ్శబ్దంలో హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లు

Caption of Image.

ఐటీ రంగంలో కొసాగుతున్న లేఆఫ్‌లు, రిక్రూట్మెంట్స్ నెమ్మదించటం ఇప్పుడు భారత రియల్ ఎస్టేట్ రంగానికి షాక్ ఇస్తున్నాయి. నిన్నటి వరకు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడిన హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి టెక్ నగరాల్లో ఇప్పుడు ఇళ్ల విక్రయాలు ఒక్కసారిగా పాజ్ మోడ్‌లోకి వెళ్లాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల సొంతింటి కలపై ఐటీ సంక్షోభం నీలినీడలు కమ్ముకోవడంతో.. రియల్టీ మార్కెట్ ఒక్కసారిగా చల్లబడింది. ఐటీ కారిడార్‌లలో ఇప్పుడు హౌసింగ్ సేల్స్ కంటే ఎక్కువగా వెయిట్ అండ్ వాచ్ అనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది టెక్కీల నుంచి.

2026 మెుదటి 3 నెలల్లో దేశంలోని టాప్ 8 నగరాల్లో ఇళ్ల విక్రయాలు 4 శాతం మేర పడిపోయాయని నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్ చేసింది. కొత్త ప్రాజెక్ట్ లాంచ్‌లు కూడా 2 శాతం తగ్గుముఖం పట్టాయట. ముఖ్యంగా రూ.50 లక్షల లోపు ఉండే మధ్యతరగతి ఇళ్ల అమ్మకాలు ఏకంగా 23 శాతం కుంచించుకుపోయాయి. అంటే ఏఐ అభివృద్ధితో జాబ్ సేఫ్టీపై పెరుగుతున్న అనుమానాల మధ్య టెక్కీలు భారీ హోమ్ లోన్ల జోలికి వెళ్లడానికి జంకుతున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో ఐటీ ఉద్యోగులే ప్రధాన కొనుగోలుదారులు కావడంతో.. ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ క్రయవిక్రయాల్లో స్పీడ్ తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి.

అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే.. మధ్యతరగతి బడ్జెట్ హోమ్స్ అమ్మకాలు తగ్గినా.. కోటి రూపాయలకు పైగా ధర పలికే లగ్జరీ ఇళ్ల అమ్మకాలు మాత్రం 53 శాతానికి చేరి సరికొత్త రికార్డు సృష్టించాయి. అంటే సంపన్నులు ఇళ్లు కొంటూనే ఉన్నారు కానీ.. జీతంపై ఆధారపడే సామాన్య ఐటీ ఉద్యోగి మాత్రం ఇప్పుడు డైలమాలో పడ్డాడు. గ్లోబల్ ఎకానమీలో అనిశ్చితి, లేఆఫ్‌ల భయం వల్ల కొనాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతానికి ఇది కేవలం ఒక తాత్కాలిక బ్రేక్ తప్ప మార్కెట్ కుప్పకూలడం కాదని రియల్టీ నిపుణులు భరోసా ఇస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో మౌలిక సదుపాయాలు బాగుండటం, అద్దెలు స్థిరంగా ఉండటంతో లాంగ్ టర్మ్ లో మార్కెట్ మళ్లీ పుంజుకుంటుందని భావిస్తున్నారు. ఐటీ రంగంలో మళ్లీ రిక్రూట్మెంట్స్ ఊపందుకుంటే.. రియల్ ఎస్టేట్ రాకెట్ వేగంతో దూసుకుపోవడం ఖాయం అంటున్నారు. అప్పటి వరకు బిల్డర్లు, ఇన్వెస్టర్లు ఓపిక పట్టక తప్పదు. మొత్తానికి టెక్కీల జీతం.. రియల్ ఎస్టేట్ జాతకాన్ని మార్చేస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.