
హైదరాబాద్ సిటీ శివార్లలోని లక్ష్మీ ప్రియ కాలనీ అధ్యక్షుడు మధు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవలే లక్ష్మీ ప్రియ కాలనీకి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి మాజీ అధ్యక్షుడు బోడ యాదగిరి, అతని తమ్ముడు రమణ నుంచి వేధింపులు మొదలైనట్లు బంధువులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే మధుపై చెక్ బౌన్ కేసు పెట్టినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ కేసులో కోర్టుకు వెళ్లిన మధు.. బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత నుంచి బోడ యాదగిరి, అతని తమ్ముడు రమణతోపాటు కొంత మంది పోలీసులతో కలిసి వేధింపులకు గురి చేస్తున్నట్లు చెబుతున్నారు మధు బంధువులు.
ఈ క్రమంలోనే.. నకిరేకల్ పట్టణంలో ఓ ఫంక్షన్ లో ఉన్న మధును.. కొంత మంది పోలీసులు చెక్ బౌన్స్ కేసులో అదుపులోకి తీసుకుని వేధింపులకు గురి చేశారంట. నకిరేకల్ నుంచి హయత్ నగర్ వరకు తీసుకొచ్చిన పోలీసులు.. దారి పొడవునా వేధింపులకు గురి చేసినట్లు చెబుతున్నారు.
బోడ యాదగిరి, అతని తమ్ముడు రమణతోపాటు పోలీసులు వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి.. 2026, ఏప్రిల్ 22వ తేదీ ఉదయం.. ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయాడు మధు.
ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశారు మధు. నా ఆత్మహత్యకు కారణం బోడ యాదగిరి గౌడ్, వాళ్ల తమ్ముడు రమణ అండ్ బ్యాచ్. పోలీస్ సపోర్ట్ అంటూ చిన్న కాగితంపై తన బాధను వ్యక్తం చేస్తూ.. ఆ తర్వాత ఉరి వేసుకుని చనిపోయాడు మధు.
విషయం తెలిసిన బంధువులు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆటోలో మధు మృతదేహంతో.. మధు ఆత్మహత్యకు కారణం బోడ యాదగిరి ఇంటికి వచ్చి ధర్నాకు దిగారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదంటూ అక్కడే బైఠాయించారు. సూసైడ్ లేఖలో ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేయటంతోపాటు బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ధర్నా విరమించేది లేదని స్పష్టం చేశారు ఆందోళనకారులు.
ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే.. నా ఆత్మహత్యకు కారణం అంటూ సూసైడ్ నోట్ లో రాసిన బోడ యాదగిరి స్థానిక బీజేపీ నాయకుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి. వచ్చే కార్పొరేటర్ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు, సన్నాహాలు చేస్తున్నాడు.