Reading Time: 2 minutes

చెడగొట్టు వానలు..  రైతన్న గుబులు..పొద్దంతా ఎండ.. సాయంత్రం వాన

Caption of Image.
  • అడ్డం పడుతున్న మక్క,వరి పొలాలు
  • నేల రాలుతున్న మామిడికాయలు
  • కల్లాలు, కొనుగోలు సెంటర్లలో తడుస్తున్న ధాన్యం
  • పలు జిల్లాల్లో భారీగా దెబ్బతిన్న పంటలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో అకాల వర్షాలు రైతన్నను గుబులు పుట్టిస్తున్నాయి. పొద్దంతా ఎండకొడుతూ సాయంత్రానికి ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వానలు యాసంగి పంటలను ఆగం చేస్తున్నాయి. తాజాగా రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌, వరంగల్‌‌‌‌  జిల్లాల్లో విస్తృతంగా  పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే దశలో ఉన్న వరి పొలాలు, మక్కజొన్న చేన్లు అడ్డం పడిపోగా, మామిడితోటల్లో కాయలు రాలిపోతున్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న మక్క, వరి పంటలు నేలకొరిగాయి.

ఇప్పటికే కోసి కల్లాల్లో ఆరబోసిన మక్క, వడ్లు తడిసి ముద్దవుతున్నాయి. మార్కెట్‌‌‌‌  యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో బస్తాల్లో నింపిన ధాన్యాలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ మార్కెట్‌‌‌‌  యార్డుల్లో వర్షం తీవ్ర ప్రభావం చూపింది. విక్రయానికి తీసుకొచ్చిన మక్క, వడ్లు, పసుపు రాశులు పూర్తిగా తడిసిపోయాయి. పలుచోట్ల టార్పాలిన్లు ఈదురుగాలులకు ఎగిరిపోవడంతో రైతులు నిల్వ ఉంచిన ధాన్యానికి రక్షణ లేకుండా పోయింది. కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు, షెడ్లు లేకపోవడంతో నష్టం మరింత పెరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంటంతా ఆగమైంది

అకాల వర్షాల ప్రభావం వరి, మక్కపైనే కాకుండా మామిడి, పసుపు, మిర్చి, జొన్న పంటలపైనా పడింది. బలమైన గాలుల కారణంగా వరి, మక్క చేన్లన్నీ నేలవాలాయి. మామిడితోటల్లో భారీగా కాయలు నేలరాలాయి. మిర్చి, పసుపు పంటలు తడిసి నాణ్యత కోల్పోతున్నాయి. “ఎకరన్నరలో మక్క సాగు చేశా. కోతుల నుంచి కాపాడుకుంటూ పంటను నిలబెట్టా. మరో 10- నుంచి 15 రోజుల్లో కోతకు వస్తుందని అనకున్నా. ఒక్క వర్షంతో అంతా ఆగమైంది. అప్పులు చేసి పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు” అంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పొద్దంతా ఎండతో ఆశలు కలిగించి, సాయంత్రానికి వానతో ముంచెత్తుతున్న చెడగొట్టు వానలు రైతన్న జీవితాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయి. కష్టానికి ఫలితం దక్కకుండానే పంటలు నేలపాలు కావడంతో రైతుల్లో నిరాశ పెరుగుతోంది. పలు జిల్లాల్లో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ప్రాథమికంగా పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లు గుర్తించారు. పూర్తి స్థాయి నివేదికలు సిద్ధం చేసిన తర్వాత ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

మరో ఐదు రోజులు వానలు

రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాయంత్రం సమయంలో ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశముందని, రైతులు కోసిన పంటలను రక్షించుకునే చర్యలు తీసుకోవాలని సూచించింది. బుధవారం ఆదిలాబాద్,​ ఆసిఫాబాద్​, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్,​ సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్​నగర్, నాగర్​ కర్నూల్​ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే నష్టపోయిన పంటలకు పరిహారం ప్రకటించాలని, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌‌‌‌   చేస్తున్నారు. తక్షణమే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కోరుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.