
- ప్రత్యేక కేసుగా పరిగణించి ఫండ్స్ మంజూరు చేసిన సీఎం
హైదరాబాద్, వెలుగు: దుబాయిలో అనారోగ్యంతో కోమాలోకి వెళ్లి, అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందిన జగిత్యాల జిల్లా కార్మికుడు ఆరెల్లి గంగరాజం కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించింది. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో గంగరాజం భార్య ఆరెల్లి రాజవ్వకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి చెక్ అందజేశారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన గంగరాజం గల్ఫ్‌లో కార్మికుడిగా పనిచేస్తూ కిడ్నీ సంబంధిత వ్యాధితో అనారోగ్యానికి గురయ్యారు. గతేడాది నవంబర్‌లో దుబాయ్‌లోని ఆస్టర్ హాస్పిటల్‌లో కోమాలోకి వెళ్లారు.
డిసెంబర్ 14న హైదరాబాద్‌కు తరలించి నిమ్స్‌లో చేర్చారు. డిసెంబర్ 24న చనిపోయాడు. ఎక్స్‌గ్రేషియో మంజూరు చేయాలని మృతుడి భార్య రాజవ్వ, కుమారుడు జలంధర్ మార్చి 31న ప్రజాభవన్‌లో నిర్వహించిన ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నారు. గల్ఫ్ ఎక్స్‌గ్రేషియో ప్రకారం గల్ఫ్‌లో మృతి చెందిన వారికే ఆర్థిక సాయం అందుతుంది కానీ ఈ ఘటనలో గంగరాజం జగిత్యాలలో చనిపోయాడు. అయినా బాధితుల అభ్యర్థన మేరకు ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించాలని చిన్నారెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. దానిని పరిశీలించిన సీఎం గంగరాజం కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేశారు.