
హైదరాబాద్‌లోని వివిధ స్టేషన్ల నుంచి కొత్తగా 8 వీక్లీ ట్రైన్లను కేంద్రం ప్రకటించింది. కాచిగూడ, చర్లపల్లి, హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్ల నుంచి తిరుపతి, తిరుచానూరు (ఏపీ), శ్రీ గంగానగర్, జైపూర్ (రాజస్థాన్), భువనేశ్వర్ (ఒడిశా)కు ఈ కొత్త ట్రైన్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నది.
న్యూఢిల్లీ, వెలుగు: రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని వివిధ స్టేషన్ల నుంచి కొత్తగా 8 వీక్లీ ట్రైన్లను ప్రకటించింది. హైదరాబాద్ నగరంలోని కాచిగూడ, చర్లపల్లి, హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్ల నుంచి తిరుపతి, తిరుచానూరు (ఏపీ), శ్రీ గంగానగర్, జైపూర్ (రాజస్థాన్), భువనేశ్వర్ (ఒడిశా)కు ఈ కొత్త ట్రైన్లను నడపాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది.
ప్రత్యేకంగా తిరుపతి, తిరుచానూరులాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకోసం 5 రైళ్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త ట్రైన్లతో భువనేశ్వర్, జైపూర్, శ్రీగంగానగర్‌లాంటి సుదూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మేలు జరగనున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతాల మధ్య రెగ్యులర్ రైళ్లు నడపాలని ప్రజల నుంచి వచ్చిన డిమాండ్లపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించినట్టు గుర్తు చేశారు. తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని ఈ రైళ్లను మంజూరు చేసిన ప్రధాని మోదీ, అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
కొత్త ట్రైన్ల టైమింగ్స్ ఇవే..
కాచిగూడ నుంచి ప్రతి గురువారం రాత్రి 9.30 గంటలకు తిరుచానూరు (ఏపీ) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ (17607/17608) 2026 మే 15 నుంచి ప్రారంభం కానుంది.
కాచిగూడ నుంచి ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు శ్రీ గంగానగర్ (రాజస్థాన్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ (17601/17602) జులై 14 నుంచి స్టార్ట్ అవుతుంది.
చర్లపల్లి నుంచి ప్రతి బుధవారం సాయంత్రం 6.55 గంటలకు తిరుచానూరు వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ (17047/17048) మే 7 నుంచి ప్రారంభం అవుతుంది.
చర్లపల్లి నుంచి ప్రతి బుధవారం రాత్రి 9.20 గంటలకు తిరుపతి వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ (17441/17442) మే 14 నుంచి నడుస్తుంది.
చర్లపల్లి నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు తిరుపతి వెళ్లే.. వీక్లీ స్పెషల్ ట్రైన్ (17443/17444) మే 15 నుంచి ప్రారంభం కానుంది.
ప్రతి ఆదివారం రాత్రి 9.15 గంటలకు చర్లపల్లి నుంచి తిరుచానూరు వెళ్లే.. వీక్లీ స్పెషల్ ట్రైన్ (17059/17060) మే11 నుంచి స్టార్ట్ అవుతుంది.
ప్రతి సోమవారం సాయంత్రం 6.10 గంటలకు చర్లపల్లి నుంచి భువనేశ్వర్ (ఒడిశా) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ (17067/17068) మే 5 నుంచి ప్రారంభం కానున్నది.
ప్రతి శుక్రవారం రాత్రి 7.50 గంటలకు నాంపల్లి నుంచి జైపూర్ (రాజస్థాన్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ (17079/17080) కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ రైలు ప్రారంభ తేదీని దక్షిణ మధ్య రైల్వే త్వరలోనే ప్రకటించనున్నది.