Reading Time: 2 minutes

కట్టప్ప కుటుంబంలో ఆసక్తికర పరిణామం.. తండ్రీకూతురిది ఒకదారి .. కొడుకుది మరోదారి..!

Caption of Image.

చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే.. ఈ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామం కనిపించింది. బాహుబలిలో చేసిన పాత్రతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో కట్టప్పగా నిలిచిపోయిన నటుడు సత్యరాజ్ కుటుంబంలో రాజకీయంగా చీలిక కనిపించింది. సత్యరాజ్, అతని కూతురు దివ్య అధికార డీఎంకే పార్టీలో ఉన్నారు. దివ్య ప్రస్తుతం డీఎంకే ఐటీ వింగ్ స్టేట్ డిప్యూటీ సెక్రటరీగా కొనసాగుతున్నారు.

విజయ్ జోసెఫ్ టీవీకే పార్టీపై, విజయ్పై సత్యరాజ్ బాహాటంగా విమర్శలు కూడా చేశారు. కానీ.. సత్యరాజ్ కొడుకు సిబిరాజ్ మాత్రం విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించారు. విజయ్కు తాను వీరాభిమానిని అని ఇప్పటికే ప్రకటించిన సిబిరాజ్ నేరుగా టీవీకే తరపున ప్రచారం చేయకపోయినప్పటికీ సింగనల్లూరు టీవీకే అభ్యర్థికి, వేలచ్చేరి అభ్యర్థి కుమార్కు మద్దతుగా సత్యరాజ్ కొడుకు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ ఇద్దరికీ అవకాశం ఇస్తే తప్పకుండా మంచి చేస్తారని సిబిరాజ్ ఒక వీడియో విడుదల చేశారు. విజయ్కు మద్దతుగా సిబి ఒక లేఖ కూడా రాశారు.

విజయ్తో తనకు ఉన్న అనుబంధాన్ని సిబిరాజ్ గుర్తుచేసుకున్నారు. తాను ఎల్లప్పుడూ విజయ్కు అండగా ఉంటానని ఈ లేఖలో సిబి స్పష్టం చేశారు. మరోపక్క.. సత్యరాజ్, ఆయన కూతురు దివ్య డీఎంకేకు మద్దతుగా నిలిచారు. విజయ్పై రాజకీయ విమర్శలు కూడా చేశారు. సత్యరాజ్ కుటుంబానికి ఎలా మనుగడ సాగించాలో బాగా తెలుసని, ఒకే కుటుంబంలో ఇలా రెండు రాజకీయ పార్టీలకు మద్దతు తెలిపడం.. మంచి వ్యాపార ఎత్తుగడ అని ఈ పరిణామాలను గమనించిన తమిళ సినీ వర్గాలు విశ్లేషించాయి. ఇదిలా ఉండగా.. వాడీవేడీగా సాగిన తమిళనాడు ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఆరు గంటల నుంచి ఈసీ విధించిన సైలైంట్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 23న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

►ALSO READ | ప్రకాష్ రాజ్‌పై పంజాగుట్ట పీఎస్‌లో కేసు.. శ్రీరాముడిని కించపరిచారని కరాటే కళ్యాణి ఫిర్యాదు!

దాదాపు 38 రోజుల పాటు పోటాపోటీ రోడ్ షోలు, బహిరంగ సభలతో తమిళనాడు రాజకీయాలు హాట్ హాట్గా నడిచాయి. మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. మొత్తం 4 వేల 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. డీఎంకే కూటమి, అన్నాడీఎంకే కూటమి, విజయ్ టీవీకే పార్టీ, NTK పార్టీ ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడుతున్నాయి. దాదాపు 5 కోట్ల 67 లక్షల మంది ఓటర్లు తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మే 4న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం వెల్లడిస్తుంది.

©️ VIL Media Pvt Ltd.