
నటుడు ప్రకాష్ రాజ్ మరో సారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. తన విలక్షణ నటనతోనే కాదు.. రాజీకీయ, సామాజిక అంశాలపై మాట్లాడే ఆయన.. ఈసారి పవిత్రమైన రామాయణంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే?
ఇటీవల కోజికోడ్‌లో జరిగిన కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో ప్రకాష్ రాజ్ ప్రసంగిస్తూ.. రామాయణాన్ని వింతగా విశ్లేషించారు. ఒక చిన్నారుల నాటకాన్ని ఉటంకిస్తూ.. శ్రీరాముడు, లక్ష్మణుడు ఉత్తరాది నుండి వచ్చిన వలస కూలీలని, వారు దక్షిణాదికి వచ్చి రావణుడి తోటలో పండ్లు దొంగిలించారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, దీనికి జీఎస్టీ (GST)ని ముడిపెడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి. పవిత్ర ఇతిహాసాన్ని వక్రీకరించి, మతపరమైన సామరస్యాన్ని దెబ్బతీసేలా ఆయన ప్రసంగం ఉందని కళ్యాణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసుల వద్దకు చేరిన వివాదం..
కరాటే కళ్యాణి పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ ఎం. రామకృష్ణను కలిసి ఫిర్యాదును అందజేశారు. ప్రకాష్ రాజ్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 196 , 299 , 353 , ఐటీ చట్టం సెక్షన్ 67 కింద ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలని ఆమె కోరారు. రామాయణం అనేది కోట్ల మంది భారతీయుల విశ్వాసం. దానిని వక్రీకరించి మాట్లాడటం దుర్మార్గమైన చర్య అని ఆమె మండిపడ్డారు. వివాదాస్పద వీడియోలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ, సాక్ష్యాధారాలను పోలీసులకు సమర్పించారు. మత విశ్వాసాలను అవమానించేలా, మతాల మధ్య విద్వేషాలు పెంచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
►ALSO READ | రజనీకాంత్ ‘జైలర్ 2’ ప్యాకప్.. సెట్స్‌లో సెలబ్రేషన్స్! రిలీజ్ ఎప్పుడంటే?
రూ.100 కోట్ల నోటీసులు!
మరో వైపు టీటీడీ (TTD) బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఇప్పటికే ప్రకాష్ రాజ్‌కు రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు. వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పకుంటే చట్టపరమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అటు ఢిల్లీలో కూడా పలు హిందూ సంఘాలు ఆయనపై ఫిర్యాదులు చేశాయి.
ప్రకాష్ రాజ్ రియాక్షన్..
ఈ వివాదం ముదురుతున్న తరుణంలో ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నేను ఒక సాహిత్య సదస్సులో మాట్లాడిన మాటలను కొంతమంది వక్రీకరిస్తున్నారు. ప్రశ్నలు అడిగేవారిని హిందూ వ్యతిరేకులుగా ముద్ర వేయడం అలవాటుగా మారింది అని ఆయన పేర్కొన్నారు. తాను ప్రస్తుతం తన వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నానని, అందరికీ త్వరలోనే సమాధానం చెబుతానని వెల్లడించారు . భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతిహాసాలను కించపరచడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పోలీసుల దర్యాప్తు తర్వాత ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందో చూడాలి.
Prakash Raj narrates a made up version of Ramayan to mock Hindus
-Ram JI was North Indian
-Ravan was South Indian tribal
-They became enemies bcz Ram Ji stole fruits from RavanAnd he made this blasphemous story only to promote beef eating and create north south divide
Shame… pic.twitter.com/HFAV95HXbR
— Amit Kumar Sindhi (@AMIT_GUJJU) April 16, 2026