Reading Time: 2 minutes

రాత్రి పూట బైక్స్, స్కూటర్లు బ్యాన్ : ఆ రాష్ట్రంలో ఊహించని ఆంక్షలు ఎందుకు..?

Caption of Image.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో ఎలక్షన్ కమిషన్ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు ప్రశాంతంగా, హింసకు తావులేకుండా నిర్వహించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా టూవీలర్లపై కఠినమైన ఆంక్షలు విధించింది. ముఖ్యంగా బైక్ ర్యాలీలు, రాత్రిపూట ప్రయాణాలపై ఉక్కుపాదం మోపింది. ఏప్రిల్ 23న జరగనున్న మొదటి దశ ఎన్నికల దృష్ట్యా.. మొత్తం 152 నియోజకవర్గాల్లో ఈ రూల్స్ అమల్లోకి వచ్చాయి.

రాత్రి 6 నుంచి ఉదయం 6 వరకు నో ఎంట్రీ
ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం.. సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రోడ్లపై బైకులు, స్కూటర్లు తిరగడంపై పూర్తి నిషేధం విధించారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచే నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం, అల్లర్లు సృష్టించడం వంటి చర్యలకు చెక్ పెట్టడానికే నైట్ కర్ఫ్యూ తరహా ఆంక్షలు విధించినట్లు కమిషన్ స్పష్టం చేసింది.

పగలు బైక్ పై ఇద్దరు వెళ్లొద్దు.. 
రాత్రి పూట బ్యాన్ ఒకెత్తయితే.. పగటిపూట అంటే ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు కూడా టూవీలర్లపై వెళ్లేవారికి కొన్ని కండిషన్లు పెట్టింది ఎలక్షన్ కమిషన్. అనవసరంగా ఇద్దరు వ్యక్తులు బండిపై ప్రయాణించడంపై నిషేధం విధించారు. కేవలం అత్యవసర పనుల మీద వెళ్లే వారికి మాత్రమే వెసులుబాటు ఉంటుంది. రాజకీయ ఉద్రిక్తతలు ఎక్కువగా ఉండే బెంగాల్ లాంటి రాష్ట్రంలో బైక్ ర్యాలీలను పూర్తిగా నిషేధించి, శాంతియుత వాతావరణం నెలకొల్పాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞేష్ కుమార్ అన్నారు.

ALSO READ ; మేం ఎప్పుడూ కేసీఆర్ చావు కోరుకోలేదు..

మినహాయింపులు ఎవరికంటే?

సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ నియమాల్లో కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించారు:

* మెడికల్ ఎమర్జెన్సీ: అత్యవసర వైద్య చికిత్స కోసం వెళ్లే వారికి ఎలాంటి అభ్యంతరం లేదు.
* స్కూల్ పిల్లలు: పిల్లలను స్కూళ్లలో దించడానికి లేదా తీసుకురావడానికి వెళ్లే తల్లిదండ్రులకు అనుమతి ఉంటుంది.
* కుటుంబ వేడుకలు: ఇంట్లో శుభకార్యాలు లేదా ఫంక్షన్లకు వెళ్లే వారికి మినహాయింపు ఉంటుంది.
* పోలింగ్ రోజు: ఓటు వేయడానికి వెళ్లే కుటుంబ సభ్యులు ఇద్దరు కలిసి ప్రయాణించవచ్చు. అయితే ఎమర్జెన్సీ కారణాలతో బయటకు వెళ్లాలనుకునే వారు స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ముందస్తుగా రాతపూర్వక అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేయబడింది.

ఈ ఆంక్షలపై అధికార తృణమూల్ కాంగ్రెస్.. ఎలక్షన్ కమిషన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓటర్ల జాబితా సవరణలోనూ, ఆంక్షల విధింపులోనూ బీజేపీకి లబ్ధి చేకూర్చేలా ఈసీ వ్యవహరిస్తోందని టీఎంసీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను ఈసీ, బీజేపీ తీవ్రంగా ఖండించాయి. ఓటర్లకు రక్షణ కల్పించి, పారదర్శకమైన ఎన్నికలు నిర్వహించడమే తమ బాధ్యతని కమిషన్ చెప్పింది. 

©️ VIL Media Pvt Ltd.