
లక్నోలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో అవుట్‌సోర్స్ ఉద్యోగుల కోసం తీసుకువచ్చిన కొత్త నిబంధనలు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి. గడ్డం పెంచినా, జుట్టు సరిగ్గా లేకపోయినా భారీగా జరిమానాలు విధిస్తామని యాజమాన్యం జారీ చేసిన ఆదేశాలపై సిబ్బంది మండిపడుతున్నారు.
సమాచారం ప్రకారం లక్నోలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పనిచేస్తున్న సుమారు 4,000 మంది అవుట్‌సోర్స్ ఉద్యోగులకు ఒక ఏజెన్సీ కొత్త రూల్స్ పెట్టింది. వాటి ప్రకారం పురుష ఉద్యోగులు గడ్డం పెంచినా లేదా జుట్టు పొడవుగా ఉంచుకున్నా రూ. 200 ఫైన్ కట్టాలి. ఇక మహిళలు తమ జుట్టును ముడి వేసుకోకపోయినా లేదా హెయిర్‌నెట్ పెట్టుకోకపోయినా రూ. 200 జరిమానా విధిస్తారు. డ్యూటీలో ఐడీ కార్డు లేకపోతే రూ. 100, యూనిఫాం వేసుకోకపోతే రోజుకు రూ. 200 చొప్పున ఫైన్ విధిస్తారు.
దుష్ప్రవర్తనపై కఠిన చర్యలు
కేవలం అలంకరణపైనే కాకుండా, పనిలో నిర్లక్ష్యం వహిస్తే మరిన్ని కఠిన శిక్షలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డ్యూటీలో నిద్రపోవడం, సిగరెట్ తాగడం లేదా మద్యం సేవించడం వంటివి చేస్తే రూ. 500 జరిమానా ఉంటుంది. పరిస్థితి తీవ్రంగా ఉంటే ఉద్యోగంలో నుంచి తీసేయడమే కాకుండా పోలీస్ కేసు (FIR) కూడా పెడతారు.
►ALSO READ | రాత్రి పూట బైక్స్, స్కూటర్లు బ్యాన్ : ఆ రాష్ట్రంలో ఊహించని ఆంక్షలు ఎందుకు..?
చెప్పకుండా విధులకు హాజరుకాకపోతే రూ. 2,000 వరకు భారీ జరిమానా పడే అవకాశం ఉంది. కౌంటర్ల దగ్గర పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లు డ్యూటీ సమయంలో ఫోన్లను అధికారుల దగ్గర డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
ఉద్యోగుల ఆవేదన
ఈ రూల్స్ మాపై వివక్ష చూపడమేనని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేరే పెద్ద ఆసుపత్రుల్లో లేని ఇలాంటి వింత నిబంధనలు ఇక్కడ మాత్రమే ఎందుకు పెడుతున్నారు ? ఇది మమ్మల్ని వేధించడమే అని అవుట్‌సోర్స్ ఉద్యోగులు వాపోతున్నారు. మా వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఉన్న ఈ రూల్స్ వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.