
ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా పొగడరా నీ మాతృభూమిని అన్నారు.. ఇప్పుడు సీన్ రివర్స్. ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. అక్కడ మనం మనం గ్రూపులు కట్టాలి.. కులంతో విడిపోయి కొట్టుకోవాలి అంటున్నారు.. కాలంతోపాటు మారిన భావజాలం హింసకు దారి తీస్తుంది. జర్మనీ దేశంలోని గురుద్వారలో జరిగిన బీభత్సం ఇప్పుడు షాకింగ్ కు గురి చేస్తుంది. పవిత్రమైన గురుద్వారలో విధ్వంసం అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
జర్మనీ దేశంలోని డ్యూయిస్ బర్గ్ సిటీలో ఓ పెద్ద గురుద్వార ఉంది. వేల మంది సిక్కులకు ఇది పవిత్ర స్థలం. ఎప్పటిలాగే 2026, ఏప్రిల్ 21వ తేదీన గురుద్వారలో సిక్కులు సమావేశం అయ్యారు. గురుద్వారా కొత్త బోర్డు సభ్యుల ఎన్నికపై చర్చ జరిగింది. బోర్డు సభ్యుల ఎంపికపై రెండు వర్గాలు పట్టుబట్టాయి. గొడవ మొదలైంది. మాట మాటా పెరిగింది. ఆ తర్వాత కొట్టుకున్నారు.
సిక్కుల సంప్రదాయం ప్రకారం వాళ్ల దగ్గర కిర్పాన్ (బొడ్డులో పెట్టుకునే ఒంపు తిరిగిన చిన్న కత్తి) ఉంటుంది. గొడవ సమయంలో కొందరు ఈ కత్తులతో దాడి చేశారు. అంతేనా పెప్పర్ స్ర్పే చల్లారు. ఈ తర్వాత ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకుంటూ.. కొట్టుకుంటూ బీభత్సం చేశారు. ఈ దాడిలో 50 మంది వరకు ఉన్నారని.. వీరిలో 11 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. గురుద్వారాలో ప్రార్థనలు ప్రారంభం కావటానికి కొద్ది సమయం ముందు ఈ గొడవ జరిగినట్లు జర్మనీ పోలీసులు వెల్లడించారు.
గురుద్వారాలో ఘర్షణలకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. భారీ సంఖ్యలో తరలివచ్చారు. గురుద్వారా చుట్టూ ప్రత్యేక బలగాలు మోహరించారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వాళ్లను ఆస్పత్రులకు తరలించారు.
ఈ గొడవ ముందస్తు ప్రణాళికలో భాగంగా జరిగిందని.. ముందుగానే పెప్పర్ స్ర్పే చల్లి.. ఆ తర్వాత కత్తులతో దాడి చేశారని ప్రస్తుతం బోర్డు సభ్యుల్లో ఒకరైన బిల్డ్ వివరించారు.
గురుద్వారలోని కొందరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఒక వ్యక్తి నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఘటనలను అస్సలు సహించేది లేదని.. మతపరమైన ప్రార్థనా మందిరాల్లో హింసపై కఠిన చర్యలు తీసుకుంటామని జర్మనీ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
జర్మనీలోని డ్యూయిస్ బర్గ్ గురుద్వారాలోని ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించింది జర్మనీ ప్రభుత్వం. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని స్థానిక మేయర్ ఆదేశాలు జారీ చేశారు.
https://publish.twitter.com/?query=https%3A%2F%2Ftwitter.com%2Fkingkapoor72%2Fstatus%2F2046198755330785718&widget=Video