Reading Time: 2 minutes

ఇన్ స్టాగ్రామ్ వార్ : టాప్ మోడల్ క్లాడియాను కొట్టి.. కారు కింద తొక్కి చంపిన ప్రత్యర్థులు..!

Caption of Image.

ఇన్ స్టాగ్రామ్ వార్ ఇప్పుడు హత్యల వరకు వచ్చింది. ఇన్ స్టాలో ఇన్పులెన్సర్లుగా ప్రమోషన్ చేసుకుంటున్న ఇద్దరు టాప్ సెలబ్రిటీల మధ్య గొడవ హత్యకు దారి తీసింది. లండన్ సిటీ నడిబొడ్డున.. నైట్ క్లబ్ బయట.. అర్థరాత్రి జరిగిన ఈ ఘోరం.. ప్రపంచ వ్యాప్తంగా షాక్ కు గురి చేసింది. ఇన్ స్టాలో టాప్ మోడల్ గా ఉన్న క్లాడియా హత్యకు.. పాత పగలే కారణమంటూ పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి….. 

లండన్‌లోని ఒక ప్రముఖ నైట్‌క్లబ్ వెలుపల ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. క్లాడియా గ్లామ్ అనే క్లాడియా జక్రజెవ్స్కా   & గాబ్రియెల్ కారింగ్టన్ అనే ఇద్దరు సోషల్ మీడియా స్టార్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. మొదట పిడిగుద్దులతో కొట్టుకున్న వీరిద్దరి గొడవ, చివరికి ఒకరి హత్యకు దారితీసింది.

కారుతో తొక్కించి హత్య
గొడవ జరిగిన కాసేపటికే 29 ఏళ్ల గాబ్రియెల్ కారింగ్టన్ తన బ్లాక్ మెర్సిడెస్ కారుతో క్లాడియా గ్లామ్ ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా ఆమెపై నుండి కారును పోనిచ్చి ప్రాణాలు తీసింది. ఈ సమయంలో అక్కడే ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన భయంకరమైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

నిందితురాలి అరెస్ట్
ఇన్‌స్టాగ్రామ్‌లో 3.6 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న గాబ్రియెల్ కారింగ్టన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై హత్యాయత్నం, ప్రమాదకరమైన డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, తీవ్రమైన శారీరక హాని కలిగించడం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

సాక్షుల కోసం  గాలింపు
ఈ ఘటన జరిగిన సమయంలో సెంట్రల్ లండన్‌లోని సోహో ప్రాంతంలో చాలామంది పర్యాటకులు, స్థానికులు ఉన్నారు. ఈ దారుణాన్ని కళ్లారా చూసిన వారు ఎవరైనా ఉంటే పోలీసులకు సమాచారం అందించి, విచారణకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

ఒక చిన్న గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, మరొకరి కెరీర్‌ను జైలు పాలు చేసింది. సోషల్ మీడియా ప్రపంచంలో ఫాలోయింగ్ ఉన్న వ్యక్తులు ఇలాంటి హింసకు పాల్పడటం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
 

©️ VIL Media Pvt Ltd.