Reading Time: 4 minutes

అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తేస్తం: కేసీఆర్‌‌‌‌

Caption of Image.
  • మీరు వెయ్యి జన్మలెత్తినా కేసీఆర్​ చావడు
  • జగిత్యాల జైత్రయాత్రతో రాజకీయ పునరేకీకరణ
  • కాంగ్రెస్​ పాలనంతా స్కామ్‌‌లు, కబ్జాలే..
  • ప్రాజెక్టులు పండబెట్టిన్రు.. మూసీ మాటున రియల్​ ఎస్టేట్​ నడుపుతున్నరు
  • రైతుబంధుకు రాం రాం.. దళిత బంధుకు జై భీమ్‌‌
  • యూరియా బస్తాలు ఇవ్వడమూ 
  • ఈ ప్రభుత్వానికి చేతనైతలే
  • రైతుబంధు రావాలంటే కేసీఆర్​ సభ పెట్టాల్నా
  • లాగులు పగిలేదాక చంపాలె.. మంచిమాటకు చెప్పితే వీళ్లు వినరని కామెంట్‌‌  
  • జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో 
  • బీఆర్‌‌‌‌ఎస్‌‌ అధినేత ప్రసంగం

కరీంనగర్/జగిత్యాల, వెలుగు: రాష్ట్రంలో రాబోయేది బరాబర్ బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వమేనని, మొదటి సంతకంతోనే హైడ్రాను ఎత్తి అవతల పడేస్తామని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వచ్చే ప్రభుత్వంలో జీవన్‌‌రెడ్డి జగిత్యాలకే కాదు.. తెలంగాణ రాష్ట్రానికే సేవలందించబోతున్నారని, తాను మాట ఇచ్చానంటే ఎన్నడూ తప్పలేదని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వానికి యూరియా బస్తాలు ఇవ్వడం కూడా చేతకావడం లేదని, యాప్​లు పట్టుకుని తిరిగితే కాళ్లకు వాపులొస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్​ పాలనంతా స్కామ్‌‌లు, కబ్జాలేనని, కూల్చివేతలు, దాడులు, కేసులు తప్పా చేసిందేముందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

ప్రాజెక్టులు పండబెట్టారని, మూసీ మాటున రియల్​ ఎస్టేట్​దందా నడుపుతున్నారని విమర్శించారు. వీళ్లు మంచి మాటకు చెపితే వినరని, లాగులు పగిలేదాక చంపాలే అని అన్నారు. జగిత్యాల జైత్రయాత్రతో రాజకీయ పునరేకీకరణ జరగాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి జీవన్‌‌రెడ్డి బీఆర్ఎస్​లో చేరిక సందర్భంగా జగిత్యాలలో సోమవారం రాత్రి నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. జీవన్‌‌రెడ్డి, తాను 40 ఏండ్లుగా స్నేహితులమని, భిన్న రాజకీయ పార్టీల్లో పనిచేసినా ఆలోచనలు పంచుకునేవాళ్లమని గుర్తుచేశారు. పాత కరీంనగర్‌‌‌‌ వ్యాప్తంగా జీవన్​రెడ్డికి అభిమానులు ఉన్నారని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రాణం పెట్టి పని చేశారని చెప్పారు. బోర్నపల్లి దగ్గర బ్రిడ్జి కావాలని అడిగితే.. తాను వెంటనే మంజూరు చేసినట్టు గుర్తు చేశారు. 

పార్టీలో జీవన్​రెడ్డి చేరికతో ఊపు.. 

పార్టీలో జీవన్​రెడ్డి చేరారంటేనే ఊపు వచ్చిందని కేసీఆర్‌‌‌‌ అన్నారు. ఇక్కడి నుంచే ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా అపాయింట్ చేస్తున్నానని చెప్పారు. ‘‘కరీంనగర్ ఒక్కటే కాదు..మీరు నిజామాబాద్, ఆదిలాబాద్ చూడాలి. నూటికి నూరు శాతం ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. జీవన్‌‌రెడ్డి ఒక్క జగిత్యాలకే కాదు.. తెలంగాణ రాష్ట్రానికి సేవలందించబోతున్నారు. జీవన్ రెడ్డి కోసం మీరు యుద్ధం చేయాలె. ఆయన యుద్ధం చేయడానికి ముఖాబిలా మంచిగా లేడు. ఇక్కడ మీరు సరిపోతరు. జీవన్ రెడ్డిని నాకు అప్పజెప్పాలె బయట పనిచేయడానికి. జగిత్యాల యుద్ధం మీ వంతు.. తెలంగాణ యుద్ధం మా వంతు’’ అని సభకు వచ్చిన కార్యకర్తలనుద్దేశించి అన్నారు.

‘పొద్దున లేస్తే కేసీఆర్ చావాలె అని అంటున్నరు. నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావ నా కొడుకా అనుకుంటున్నవేమో. రొయ్యలను, ఎండిపోయిన చేపలను ఎనకటికి ఉట్టి మీద దాచిపెడుతుండ్రి. పిల్లికి ఆ ఉట్టి అందదు. కింద కూసోని శాపం పెట్టేది. అది తెగాలె. కింద పడాలె అని. పిల్లి శాపానికి ఉట్టి తెగుతదా? ఈ వెధవలు కేసీఆర్ చావాలంటే కేసీఆర్ సస్తడా. జీవనన్న మనం అన్ని వర్గాలు తలెత్తుకునేదాకా సేవ చేయాల్సిందే. చివరి శ్వాస వరకు ప్రజలకు సేవ చేయాలె” అని కేసీఆర్​ పేర్కొన్నారు. 

లాగులు పగిలేదాక చంపాలె.. 

సమైక్య రాష్ట్రంలో చెరువులను కబ్జాపెట్టి నాశనం చేస్తే.. తెలంగాణ వచ్చినంక మిషన్ కాకతీయ పేరుతో చెరు వుల్లో పూడిక తీశామని కేసీఆర్‌‌‌‌ చెప్పారు. ఇదొక విప్లవంలాగా సాగిందని, అక్కడి నుంచి మొదలుపెట్టిన ప్రస్థానం పదేండ్లలో ఎక్కడివరకు వెళ్లిందో అందరికీ తెలుసని అన్నారు. ‘‘శాసనసభలో నిలబడి మంచినీళ్లు ఇవ్వకపోతే మళ్లీ తాపకు ఓట్లడగం అని చెప్పిన సీఎంను మనం ఎప్పుడున్న చూసినమా? నేను చెప్పిన. మిషన్ భగీరథ నీళ్లు ప్రతి తండాకు, ఇంటికి ట్యాప్ పెట్టి ఐదేండ్లు ఇచ్చినం. ఇప్పుడేం రోగం పుట్టింది. ఇప్పుడు నీళ్లెందుకు రావడం లేదు. ఇసోంటోళ్లను ఏం చేయాలె. లాగులు పగిలేదాకా చంపాలె. మంచిమాటకు కాకపోతే ఏం చేస్తరు” అని వ్యాఖ్యానించారు. 

అర్రాస్ పాట పాడినట్టు హామీలిచ్చారు..

ఓటేసేటప్పుడు ప్రజలకు చిలకకు చెప్పినట్లు చెప్పానని, ‘వీళ్ల గుండెలో తడిలేదు. రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్ అయితదన్నా’ అయిందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ‘‘ఇయ్యాల కాంగ్రెసోళ్లు కాటారంలోనో.. కూటారంలోనూ సభ పెట్టిర్రట. ఒక్క తాపకు వేసే రైతుబంధు 2 నెలలకు ఒక ఎకరానికి వేస్తున్నరు. ఆనాడు మేం 10 రోజుల గ్యాప్‌‌లో అందరికీ వేసేది. అడ్డగోలుగా అర్రాస్ పాట పాడినట్టు హామీలిచ్చారు. కేసీఆర్ 10 వేలు ఇస్తే.. మేం 15 వేలు ఇస్తం. పింఛన్లు రూ.2 వేలు ఇస్తే.. మేం 4 వేలు ఇస్తం. దివ్యాంగులకు 4 వేలు ఇస్తే.. మేం 6 వేలు ఇస్తం. అనేసరికి మనోళ్లు మోస పోయిండ్రు. ఇది మోసంరా నాయిన.. గోసపడుతుం. ఆర్థిక పరిస్థితి అట్లలేదు అని ఆ రోజు మీటింగ్‌‌లలో చెప్పిన. కానీ కొద్ది మంది ఆశపడితే అందరికీ మోసమైంది”అని అన్నారు. 

యూరియా బస్తాలు ఇవ్వడం చేతకావట్లే.. 

జగిత్యాలలో కేసీఆర్ సభ అనగానే రైతుబంధు వేశారని, మళ్లోసారి రైతుబంధు కావాలంటే మళ్లీ తాను మీటింగ్ పెట్టాల్నా? అని కేసీఆర్‌‌‌‌ ఎద్దేవా చేశారు. ‘‘కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యి కదా.. ఇన్నేళ్లు నడిచింది కదా.. ఇప్పుడేం రోగమొచ్చే. కరెంట్‌‌ను కాకి ఎత్తుకపోయిందా.. అనేక చోట్ల పొలాలు ఎండుతున్నయి. ప్రాజెక్టులు పండబెట్టి న్రు. ఈ ప్రభుత్వానికి యూరియా బస్తాలు ఇవ్వడం చాతనైతలేదు. యాప్‌‌లు పట్టుకుని తిరిగితే కాళ్లకు వాపులు వస్తున్నయ్‌‌. బస్తాలు మాత్రం దొరుకుతలేవు” అని కేసీఆర్ మండిపడ్డారు. 

ఒక్కరూ తృప్తిగా లేరు.. 

రాష్ట్రంలో ఏ ఒక్కరూ తృప్తిగా లేరని కేసీఆర్​ పేర్కొన్నారు. ‘‘కేసీఆర్ అనేటోడు సక్కగ చేస్తలేడు. మాది బాగా అనుభవం ఉన్న పార్టీ. బ్రహ్మాండంగా చేస్తం. మీకు ఆరు చందమామలు, ఏడు సూర్యులు పెడతామన్నరు. ఇయ్యాల రాష్ట్ర ఆదాయం ఎందుకు దిగజారిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు భూముల రేట్లు ఎట్లుండే. రోడ్డు పక్కన భూమికి కోటి 2 కోట్లు ఉండే. ఇప్పుడు అమ్మేటోడు ఉన్నా.. కొనేటోడు లేడు. రైతుల భూముల ధరలు పడిపోయినయి. రైతాంగం అన్నింటికి గోసపడుతున్నరు. 

మక్కలు, వడ్లు కొనడం లేదు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు మళ్లీ మొదలైనయి. వాళ్లకు ఆర్డర్లు బంద్ చేసిన్రు. ఇంకెవరికో పర్సంటేజీల కోసం ఇచ్చిన్రు. రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్లు దాచుకున్న డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. పనికిమాలిన ఫ్రీ బస్సు పెట్టిండ్రు.. తాము ఆగమైనం అని ఆటో కార్మికులు అంటున్నరు. ఫీజు రీయింబర్స్ మెంట్ రావడం లేదు. వాళ్లు కోర్టుకుపోతే పిల్లల దగ్గర వసూలు చేసుకొమ్మని తీర్పులు చెప్తున్నయి. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు రూ.20 లక్షలు ఇచ్చినం. దాన్ని బంద్ చేసిన్రు” అని  ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో స్కామ్‌‌, సివిల్ సప్లయిస్‌‌తో స్కామ్‌‌, ఎక్కడ చూసినా భూకబ్జాలు అని విమర్శించారు. 

హైడ్రాను ఎత్తి అవతల పడేస్తం.. 

మూసీ అని అక్కడ ఉండే గరీబోళ్ల వెంటపడుతున్నారని, అది అయ్యేది కాదు.. పోయేది కాదని కేసీఆర్ అన్నా రు. భూకబ్జాలు పెట్టే రియల్ ఎస్టేట్ దందా అది అని ఆరోపించారు. ‘‘వీళ్ల అందానికి బోడగుండు హైడ్రా అని తెచ్చి పెట్టిన్రు. పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌‌ కుమార్ నిజామాబాద్‌‌కు పోయి నిడ్రా తెస్తామని చెప్పిండు. రేపు జగిత్యాలలో జిడ్రా తీసుకొస్తరు. ఇవ్వాళ ఏం కూలగొట్టుడు. పోరగాళ్లు పుస్తకాలు తెచ్చుకునే టైం కూడా ఇస్తలేరు. బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే మొదటి సంతకంతోనే హైడ్రాను ఎత్తి అవతల పారేస్తం” అని అన్నారు.  

మోటార్లకు మీటర్లు పెడతరు.. 

తన ప్రాణంపోయినా కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్ట అని మోదీకి చెప్పానని కేసీఆర్​ తెలిపారు. దీంతో రూ.30 వేల కోట్లు రాష్ట్రానికి ఆపేశారని అన్నారు.“ఇప్పుడు వీళ్లు ఢిల్లీకి పోయి ఒప్పుకున్నరు. మీటర్లు పెడ తారట. దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలె. ఇంట్ల ఉన్న ఆడపిల్లలకు రూ.2,500 ఏడబాయే. స్కూటీలు ఏడబాయే. 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి మోసం చేసిన్రు. కూల్చివేతలు, పోలీస్ దాడులు,  ఇదా రాజకీయం? ఇంతకు మించి మీరు చేసిందేముంది. అందుకే తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్లీ ప్రారం భం కావాలె. జగిత్యాల జైత్రయాత్రతో రాజకీయ పునరేకీకరణ జరగాలె” అని కేసీఆర్‌‌‌‌ పిలుపునిచ్చారు.

పక్షిలాగా తిరిగినా.. 

నాడు తెలంగాణ చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండేదని కేసీఆర్‌‌‌‌ గుర్తుచేశారు. ‘‘అసెంబ్లీలో ప్రణయ్ భాస్కర్ తెలంగాణ అని మాట్లాడబోతుంటే.. తెలంగాణ, గిలంగాణ అని మాట్లాడొద్దని అన్నరు. మన భాష మీద దాడి.. సంస్కృతిపై దాడి చేసేటోళ్లు. పాలమూరు జనం నూటికి 90 శాతం మంది వలస పోయేది. గంజి కేంద్రాలు పెట్టేవాళ్లు. అంత అధ్వాన స్థితికి తెలంగాణను తెచ్చిండ్రు. మన దగ్గర అడిగే నాయకుడు లేడు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పటి సీఎం చంద్రబాబు కరెంట్‌‌చార్జీలు పెంచిండు. దానిపై నేను లేఖ రాసిన. కరెంట్ చార్జీల ఉద్యమంలో ముగ్గురిని కాల్చి చంపిన్రు. 

అప్పుడే నేను తెలంగాణ కోసం బయల్దేరిన. అప్పుడు చాలా అవమానించిన్రు. బక్కోడిని పిసికేస్తమన్నరు. పక్షిలాగా తిరిగితే ఉద్యమ కెరటం తయారైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రోశయ్య  14 ఎఫ్ జీవో తీసుకొచ్చిండు. అప్పుడే కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని సిద్దిపేటలో శపథం చేసి.. బయల్దే రిన. ప్రజలంతా కలిసొచ్చిండ్రు. తెలంగాణ ఏర్పాటు చేస్తామని, నువ్వు దీక్ష బంద్ చేయ్ అని హోంశాఖ మంత్రి ప్రకటన చేసి.. వెనక్కి పోయిండు.. ఆ తర్వాత జేఏసీలు పెట్టి, నానా తంటాలుపడి మరో మూడున్నరేండ్లు పోరాడితే తెలంగాణ వచ్చింది” అని పేర్కొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.