
టెహ్రాన్: సెకండ్ ఫేజ్ చర్చల కోసం అమెరికా-ఇరాన్ సిద్ధమవుతోన్న వేళ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ముగింపు కోసం పాకిస్తాన్లో జరగనున్న రెండో దఫా చర్చలకు హాజరు కాలేమని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా వైఖరే ఇందుకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది.
అమెరికా మితిమీరిన డిమాండ్లు, ఆ దేశ వైఖరిలో నిరంతర మార్పులు, హార్మూజ్ జలసంధిలో తమ ఓడరేవులపై కొనసాగుతున్న అమెరికా నావికా దిగ్బంధనాన్ని కాల్పుల విరమణ ఉల్లంఘనగా పరిగణిస్తూ రెండో దఫా చర్చలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. 2026, ఏప్రిల్ 22వ తేదీ వరకు ఇరాన్-అమెరికా మధ్య తాత్కాలిక కాల్పుల విమరణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.
దాదాపు 7 వారాలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఏప్రిల్ 10న అమెరికా ఇరాన్ చర్చలు జరిపాయి. కానీ ఎలాంటి ఒప్పందం కుదరకుండానే అసంపూర్తి ఈ చర్చలు ముగిశాయి. దీంతో ఏప్రిల్ 20న మరోసారి భేటీ అయ్యి చర్చలు జరపాలని నిర్ణయించాయి. కానీ అమెరికా తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న ఇరాన్ రెండో దఫా చర్చలకు రాలేమని కరాకండిగా చెప్పేసింది.
►ALSO READ | జపాన్‌లో అతిపెద్ద భూకంపం.. భారీ సునామీ హెచ్చరికలు జారీ
ఇరాన్ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రెజా ఆరెఫ్ చర్చల పట్ల అమెరికా వైఖరిని తీవ్రంగా విమర్శించారు. మొదట కాల్పుల విరమణ, శాంతి చర్చలు అని ఇప్పుడేమో కఠిన వైఖరిని అవలంబిస్తోందని మండిపడ్డారు. అమెరికావి పిల్లచేష్టలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా తీరు అస్థిరంగా ఉందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
రెండో దఫా చర్చల కోసం అమెరికా బృందం పాకిస్తాన్ వెళ్తుందని ప్రకటించగా.. ఇరాన్ మాత్రం చర్చలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో నెక్ట్స్ ఏం జరగబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇరుదేశాల మధ్య చర్చలు విఫలం కావడంతో ఏప్రిల్ 22తో ముగియున్న కాల్పుల విరమణ ఒప్పందం మళ్లీ పొడగించే సూచనలు కనిపించడం లేదు.